Heroines: అలా వచ్చారు.. ఇలా కనుమరుగయ్యారు.. ఆ తారలు ఎవరంటే?

27 Feb, 2023 20:04 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించడం అంతా ఈజీ కాదు. అలాగే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. అలా కొందరు సూపర్ హిట్‌ మూవీస్‌లో నటించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కొందరు హీరోయిన్లు పెళ్లిబంధంతో జీవితంలో సెటిలైతే.. మరికొందరు అసలుకే కనుమరుగైపోయారు. అలా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. ఇలా కనిపించకుండా హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. 

నువ్వే కావాలి హీరోయిన్ రిచా

హీరోయిన్‌ రిచా పల్లాడ్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్‌ అంటే ట​​క్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమ‌క‌థాచిత్రం వ‌చ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

నువ్వు నేను హీరోయిన్ అనిత

బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్‌ అనిత.. ఉదయ్ కిరణ్‌తో కలసి నటించింది. శ్రీరామ్‌', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ''తాళ్, కుచ్‌ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్‌తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్ 

ఉదయ్‌కిరణ్‌, రీమా సేన్‌ 'చిత్రం' మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అయిన శివ‌క‌ర‌ణ్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు

బద్రిలో నటించిన రేణు దేశాయ్

పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన ‘బద్రి’. ఆ తర్వాత రేణు దేశాయ్ ప్రేమలో పడి పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

 వంశీ మూవీ హీరోయిన్ నమ్రత

వంశీ మూవీ సమయంలో మహేశ్‌ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. 

అదే విధంగా స్టూడెంట్ నంబర్- 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన గజాలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే కనిపించింది. అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ సరసన కనిపించిన రక్షిత కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. 6 టీన్స్ మూవీలో నటించిన రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ నటించిన  లిసా రే, బన్నీ మూవీలో అల్లు అర్జున్‌తో జోడిగా కనిపించిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించినా ఆ తర్వాత కనుమరుగైపోయారు. 

మరిన్ని వార్తలు