విడుదలకు సిద్ధం అవుతున్న త్రిష 'రాంగీ' చిత్రం

29 Dec, 2022 10:01 IST|Sakshi

తమిళసినిమా: రాంగీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం పొన్నియిన్‌ సెల్వన్‌ ఘన విజయం తరువాత త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్‌ సినిమా. అదే లైకా ప్రొడక్షన్స్‌ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రం ఫేమ్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు. స్వదేశం నుంచి విదేశాల వరకు సాగే ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. ఇన్ని ఆసక్తికరమైన విషయాలున్న రాంగీ చిత్రం ఈ నెల 30వ తేదీ భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని ఒక హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

త్రిష మాట్లాడుతూ కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ యాక్షన్‌ కథా చిత్రంగా రాంగీ ఉంటుందన్నారు. ఇది తనకు చాలా స్పెషల్‌ చిత్రం అని పేర్కొన్నారు. చిత్రాన్ని లైకా సంస్థ ఎక్కడా రాజీపడకుండా నిర్మించిందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ కోసం రెండుసార్లు ఉజ్జెకిస్తాన్‌ వెళ్లినట్లు చెప్పారు. తనతో ఫైట్‌ మాస్టర్‌ రాజ్‌కుమార్‌ యాక్షన్‌ సన్నివేశాలను చాలా కేర్‌ తీసుకుని రూపొందించినట్లు తెలిపారు. సాధారణంగా తాను దర్శకుడు చెప్పినట్లు నటించి వెళ్లిపోతానని అయితే ఆ తరువాత సంగీతం, ఎడిటింగ్‌ వంటి చాలా విషయాలను చిత్ర టీమ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అవన్నీ కర్టెక్ట్‌గా ఉంటేనే చిత్రం సక్సెస్‌ అవుతుందన్నారు.

ఈ విషయంలో దర్శకుడు శరవణన్‌ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని ప్రశంసించారు. నటి త్రిష ఇలా చిత్రం కోసం ఎంతగానో సహకరించారని దర్శకుడు శరవణన్‌ పేర్కొన్నారు. కరోనా కాలంలో సమయం ఉండడంతో చిత్రానికి రెండుసార్లు ఎడిటింగ్‌ చేసినట్లు తెలిపారు. ఈ కథను ఓకే చేసిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.

మరిన్ని వార్తలు