మరో రెండు భాగాలు

3 Aug, 2020 01:01 IST|Sakshi
రాహుల్‌ యాదవ్‌ నక్కా

నవీన్‌ పోలిశెట్టి హీరోగా, శ్రుతి శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’. డైరెక్టర్‌ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది జూన్‌లో విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా పుట్టినరోజుని పురస్కరించుకొని ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ట్రయాలజీగా వస్తుందని ప్రకటించారు. అంటే ఈ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట. ఈ సందర్భంగా రాహుల్‌ యాదవ్‌ నక్కా మాట్లాడుతూ–‘‘స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.

తను దర్శకత్వం వహిస్తోన్న రెండో సినిమా పూర్తవగానే ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్‌ మొదలవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం. ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్‌ రైట్స్‌ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి. మా చిత్రం జపాన్‌ భాషలో అనువాదం అవుతుండటం మరో విశేషం. సెప్టెంబర్‌ 11న అక్కడ విడుదలవుతోంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు