Aha Naa Pellanta Review: ‘అహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

17 Nov, 2022 11:22 IST|Sakshi

వెబ్‌సిరీస్‌ టైటిల్‌ : అహ నా పెళ్ళంట (8 ఎపిసోడ్స్‌)
నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, తదితరులు
నిర్మాతలు: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా
కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి
దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి
సంగీతం : జుడా శాండీ
నేపథ్య సంగీతం: పవన్‌
సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ 
ఎడిటర్‌: మధు రెడ్డి
విడుదల తేది: నవంబర్‌ 17, 2022(జీ5)

కెరీర్‌ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్‌ విజయాలు అందుకొని టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. అయితే ఈ యంగ్‌ హీరోకి ఈ మధ్య బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్‌ రాహుల్‌’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్‌ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. ఆయన నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘అహ నా పెళ్లంట’. శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌.  నేటి(నవంబర్‌ 17) నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  మరి రాజ్‌ తరుణ్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

‘అహ నా పెళ్లంట’ కథేంటంటే.. 
నారాయణ అలియాస్‌ నో బాల్‌ నారాయణ( హర్ష వర్ధన్‌), సుశీల(ఆమని) దంపతులు ముద్దుల కొడుకు  శ్రీను (రాజ్‌ తరుణ్‌). చాలా అల్లరిగా ఉండే శ్రీను.. చిన్నప్పుడు స్కూల్‌లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇకపై అమ్మాయిలతో మాట్లాడనని, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని తల్లి సుశీలకు ప్రామిస్‌ చేస్తాడు. చెప్పినట్లే శ్రీను అమ్మాయిల జోలికి వెళ్లడు. చూడ చూడక ఒక అమ్మాయిని చూస్తే.. ఆ రోజు నాన్న నారాయణకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది.

దీంతో శ్రీను తను అమ్మాయిలను చూడడం వల్లే నాన్నకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పెళ్లి చేసుకుంటే ఇవేవి ఉండవని భావిస్తాడు. తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడుగుతాడు. వారు చూసిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది. సరిగ్గా పెళ్లి రోజు ఆ అమ్మాయి ‘ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాను’అని లేఖ రాసి పారిపోతుంది. పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగడంతో శ్రీనుతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు.

తన పెళ్లి ఆగడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్‌) అని శ్రీను తెలుసుకుంటాడు. తన కుటుంబం లాగే ఆమె ఫ్యామిలీ కూడా బాధపడాలని పెళ్లికి ఒక్కరోజు ముందు మహాను కిడ్నాప్‌ చేస్తాడు. అసలు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా ఎలా కారణమైంది? కిడ్నాప్‌ తర్వాత శ్రీను, మహా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండడానికి కారణమేంటి? మహా ప్యామికీ వచ్చిన ఓ సమస్యను శ్రీను ఎలా పరిష్కరించాడు? ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు?  తనను కిడ్నాప్‌ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మహా తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే వరుసగా ఎనిమిది ఎపిసోడ్స్‌ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
'అహ నా పెళ్ళంట' ఓ రొమాంటిక్‌ కామెడీ వెబ్‌ సిరీస్‌. పెళ్లి పీటల దగ్గరు వరుడిని వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ వధువు కథ ఇది. వరుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. వెబ్‌ సిరీస్‌లా కాకుండా సినిమాలా కథనం సాగుతుంది. దీనికి కారణం దర్శకుడు సంజీవ్‌ రెడ్డి టేకింగ్‌ అనే చెప్పాలి. వెబ్‌ సిరీసే అయినప్పటికీ.. సినిమాలోలాగా పాటలు, కామెడీ, రొమాన్స్‌..అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు.

తొలి ఎపిసోడ్‌ నిడివి ఎక్కువైనప్పటికీ సరదాగా సాగుతుంది. పాటలు, కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. రెండో ఎపిసోడ్‌ కాస్త నెమ్మగా, రొటీన్‌గా సాగుతుంది. మహా కిడ్నాప్‌తో మూడో ఎపిసోడ్‌ ఇంట్రెస్టింగ్‌ సాగుతుంది. కిడ్నాప్‌ సమయంలో, ఆతర్వాత వచ్చే కామెడీ సీన్స్‌ నవ్విస్తాయి. నాలుగో ఎపిసోడ్‌ రొటీన్‌గా సాగినప్పటికీ.. శ్రీను, మహా ఒకే ఫ్లాట్‌లోకి రావడంతో ఆసక్తి పెరుగుతుంది. ఐదో ఎపిసోడ్‌ కూడా కామెడీగానే సాగుతుంది.

ఆరో ఎపిసోడ్‌ నుంచి కథ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చాలని శ్రీను నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లిపోవడం.. శ్రీనుతో ప్రేమలో పడడం ఇలా ఎమోషనల్‌గా మిగతా ఎపిసోడ్స్‌ సాగుతాయి. క్లైమాక్స్‌ కూడా కాస్త డిఫరెంట్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. రొటీన్‌ స్టోరీనే అయినా.. ఫ్రెష్‌గా, ఎలాంటి అశ్లీలత లేకుండా ఈ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కించాడు సంజీవ్‌ రెడ్డి.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ని ఎంచుకొని, తెరపై అనుకున్న విధంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

ఎవరెలా చేశారంటే.. 
శ్రీను పాత్రలో రాజ్‌ తరుణ్‌ ఒదిగిపోయాడు. తనదైన శైలీలో కామెడీ పండించాడు. మహా పాత్రకు  శివానీ రాజశేఖర్‌ న్యాయం చేసింది. ఆమె పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. రాజ్‌తరుణ్‌, శివానీ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్‌ అయింది. హీరో తల్లిదండ్రులుగా ఆమని, హర్షవర్ధన్‌ బాగా నటించారు. రాజ్ తరుణ్  స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి బాగానే నవ్వించారు.  

పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, సీఐగా రఘు కారుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి.  నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు రిచ్‌గా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు