జల్లికట్టు నేపథ్యంలో వెబ్‌సిరీస్‌.. త్వరలో ఆహాలో

13 Oct, 2022 15:19 IST|Sakshi

తమిళసినిమా: జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ పేటైకాళి. దర్శకుడు వెట్రివరన్‌ సమర్పణలో ఆహా ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌ ఇది. మేర్కు తొడచ్చి మలైత్రం ఫేమ్‌ ఆంథోని కథానాయకుడిగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో నటుడు కలైయరసన్, కిషోర్, వేలన్‌ రామమూర్తి, నటి షీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎల్‌.రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక అడయారులోని ఎంజీఆర్‌ జానకి కళాశాలలో నిర్వహించారు. 2 వేల మంది విద్యార్థులు, ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు.

అనంతరం ఆహా ఓటీటీ సంస్థ సీఈఓ మాట్లాడుతూ జనరంజకమైన కార్యక్రమాలను అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయల కథలు అందించే విషయంలో పేటై కాళి వెబ్‌ సిరీస్‌ను తొలి ఉదాహరణగా భావిస్తున్నామన్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను త్వరలో ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దర్శకుడు రాజ్‌కువర్‌ మాట్లాడుతూ ఆదిలో మానవులంతా అడవుల్లో తిరిగే వారన్నారు.

ఆ తరువాత పశువులు (ఎద్దులు) వారి జీవితంలోకి రావడంతో వ్యవసాయం చేయడం, పశువుల పెంపకం వంటివి నేర్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పశువులు వచ్చిన తరువాతే మనుషుల జీవితంలో సంస్కృతి, సంప్రదాయం పెంపొందాయన్నారు. అప్పట్లో మనుషులు ఎద్దులను లొంగ తీసుకోవడమే క్రమేణా జల్లికట్టుగా మారిందని చెప్పారు. ఇదే మన రాష్ట్రంలో జరుగుతున్న సంప్రదాయ క్రీడ అని పేర్కొన్నారు. ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను ఈ పేటైకాళి వెబ్‌సిరీస్‌ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు