Piracy Websites: పైరసీకి చెక్‌.. ఆ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు

30 Aug, 2022 08:47 IST|Sakshi

తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్‌ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్‌ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్‌ స్క్రీన్స్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు.

కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్‌ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్‌ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్‌ తరుఫున న్యాయవాది విజయన్‌ సుబ్రహ్మణియన్‌ హాజరై వాదించారు.

పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్‌సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్‌ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు