-

Vijay Sethupathi: ఎయిర్‌పోర్ట్‌ వివాదం: విజయ్‌ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

13 Feb, 2023 15:31 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా తమిళ్‌, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మెప్పిస్తున్నాడు. ఇటీవల విక్రమ్‌ మూవీలో అలరించిన ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్‌ సేతుపతిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఆయన కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆయనకు చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం విజయ్‌ సేతుపతి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: శివరాత్రి స్పెషల్‌: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే

2021లో బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. దీంతో విజయ్‌ సేతుపతి, అతడి మనుషులు తనపై దాడి చేశారని, తనని అభ్యంతరకర పదాలతో విజయ్‌ దూషించారని ఆరోపిస్తూ మహా గాంధీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికీ ఈ కేసు కోర్టులోనే ఉంది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు విజయ్‌ సేతుపతిని హెచ్చరించింది.

చదవండి: ముంబైలో సిద్ధార్థ్‌-‍కియారా గ్రాండ్‌ రిసెప్షెన్‌, బాలీవుడ్‌ తారల సందడి.. ఫొటోలు వైరల్‌

‘సెలబ్రెటీలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు పెద్ద హీరో. మీకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రజల్లో ఉన్నప్పుడు మీ ప్రవర్తన అదుపులో ఉండాలనే విషయాన్ని గుర్తు పెట్టుకొండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీకు ఇష్టం వచ్చినట్లు దూషించడం సరైనది కాదు. ప్రజలని తిడుతూ సెలబ్రెటీలు వారి మధ్యలో తిరగడం సాధ్యం కాదు’ అంటూ విజయ్‌ని కోర్టు హెచ్చరించింది. ఆ తర్వాత ఇద్దరికీ అంగీకారం అయితే చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తమ సమాధానం చెప్పేందుకు ఇద్దరూ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను మార్చి 2కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం కోర్టు. 

మరిన్ని వార్తలు