Aishwarya Rai Bachchan : పొన్నియన్‌ సెల్వన్‌.. ఆసక్తి పెంచుతున్న ఐశ్వర్యారాయ్‌ పాత్ర

16 Sep, 2022 10:25 IST|Sakshi

తమిళ సినిమా: ప్రస్తుతం ప్రతి నోటా వినిపిస్తున్న మాట అంతా పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ గురించే. కారణం అది తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం కావడమే. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి చారిత్రిక నేపథ్యంలో రాసిన నవల ఇది. కల్కి అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవల సాహితీ ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందింది. దీన్ని సినిమాగా తీయడానికి దివంగత నటుడు ఎంజీఆర్‌ నుంచి కమల్‌హాసన్‌ వరకు పలువురు ప్రయత్నించారు. అయితే దర్శకుడు మణిరత్నం కూడా రెండుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు.

ఆయన మొక్కవోని పట్టుదలతో మూడోసారి ప్రయత్నంలో పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా రెండు భాగాలుగా కార్యరపం దాల్చుతోంది. అందులో తొలిభాగం ఈ నెల 30వ తేదీన పాన్‌ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు విక్రమ్, జయం రవి కార్తీ, శరత్‌ కుమార్, ప్రకాష్‌ రాజ్, పార్తీబన్, విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదలగు ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రల్లో నటింన చిత్రం ఇది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్‌ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది చోళ రాజుల కాలం నేపథ్యంలో సాగే కల్పిత అంశాలతో కూడిన చారిత్రక కథా చిత్రం. ఇందులో నందిని అనే రాజకుమారి పాత్రను పోషించారు. ఆమె పాండియన్‌ దేశానికి చెందిన యువతి. కళ్లు చెదిరే సౌందర్యవతి. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోయే యువతి. తన ప్రేమికుడైన వీర పాండియన్‌ అనే పాండ్య దేశరాజును తన కళ్ల ముందే శిరచ్ఛేదనం చేసిన చోళ దేశం రాజు ఆదిత్య కరికాలన్‌పై ప్రతీకారం తీర్చుకుని ఆ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నే రాణిగా నటిస్తోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినప్పుడే మణిరత్నం నందిని పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని ఫిక్స్‌ అయ్యారట. 

మరిన్ని వార్తలు