ఈ హీరోయిన్ల పెళ్లి దుస్తుల ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

18 Jun, 2021 18:42 IST|Sakshi

పెళ్లిలో అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన సెలబ్రిటీలు

వెబ్‌డెస్క్‌: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం అంటే వివాహమే. ఒంటరిగా సాగుతున్న జీవన ప్రయాణంలో భాగస్వామి అడుగుపెట్టడంతో జీవితం పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు చాలా మంది. అచ్చంగా మన సొంతమయ్యే తోడుతో బంధం ఏర్పడే ఆ అపురూప ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లిరోజున ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి.. ఆపాదమస్తకం ఎలా తయారు కావాలి అన్న విషయాల గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తమ స్తోమతకు తగ్గట్లుగా బడ్జెట్‌లో అన్ని ప్లాన్‌ చేసుకుంటారు. 

ఇక సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే, మనలాగా ఆర్థిక లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజు మరింత అందంగా కనబడేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్న తరుణంలో ఐశ్వర్యారాయ్‌ మొదలు ప్రియాంక చోప్రా వరకు పలువురు హీరోయిన్లు ధరించిన దుస్తులు, వాటి ఖరీదు తదితర వివరాలు తెలుసుకుందాం. డిజైన్లు నచ్చితే.. అచ్చంగా అవేకాకపోయినా అలాంటి వాటిని పోలిన దుస్తుల్లో మెరిసిపోయేందుకు రెడీ అవ్వొచ్చు కదా. ఏమంటారు?!

రూ. 75 లక్షల ఖర్చు!
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ఐశ‍్వర్యారాయ్‌, బిగ్‌ బీ అమితాబ్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ 2007, ఏప్రిల్‌ 20న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకువచ్చిన ఈ జంట.. పెళ్లిరోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్‌.. తమ సంస్కృతికి పెద్దపీట వేస్తూ.. నీతా లుల్లా డిజైన్‌ చేసిన కాంజీవరం చీర ధరించింది. బంగారు తీగలు, స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ. 75 లక్షలట. అప్పటి వరకు ఒక పెళ్లికూతురు ధరించిన అత్యంత ఖరీదైన అవుట్‌ఫిట్‌ ఇదేనని ఫ్యాషన్‌ నిపుణుల మాట. మరి ఐశ్వర్యారాయ్‌ అంటే ఆ మాత్రం ఉండాలి కదా!

‘సాగరకన్య’ చీర ధర అరకోటి!
ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకోవడంతో బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. 2009లో రాజ్‌కుంద్రాను వివాహమాడిన ఈ ‘సాగరకన్య’.. పెళ్లినాడు తరుణ్‌ తహిలియాని రూపొందించిన అవుట్‌ఫిట్‌ ధరించారు. ఇందులో దాదాపు 8000 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ ఇమిడిఉన్నాయట. దాని ధర రూ. 50 లక్షలు అని ఫ్యాషన్‌ వర్గాల భోగట్టా.

‘సవ్యసాచి’ డిజైన్‌తో ఆకట్టుకున్న అనుష్క
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లిరోజున తమ వస్త్రధారణ మరింత స్పెషల్‌గా ఉండేలా చూసుకున్నారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేసిన అవుట్‌ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు. ఆనాడు అనుష్క ధరించిన పేస్టల్‌ కలర్‌ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట.

అత్యంత ఖరీదైన, అందమైన దుస్తుల్లో సోనం!
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందింది స్టార్‌ కిడ్‌ సోనం కపూర్‌. సినిమాలతో పాటు తన వస్త్రధారణ పట్ల తన అభిరుచితో ఎంతో మంది అభిమానం చూరగొన్న ఈ భామ.. 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె ధరించిన దుస్తులు టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అయ్యాయి. అనురాధా వకీల్‌ రూపొందించిన ఎరుపు రంగు అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన సోనం.. దీనికోసం సుమారు 70- 90 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట.

పిగ్గీచాప్స్‌ సైతం తనదైన స్టైల్‌లో..
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా- అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతుల్లో రెండేసి సార్లు పెళ్లిప్రమాణాలు చేసిన ఈ జంట.. తమదైన శైలి డిజైన్లతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్‌ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలట.

దీప్‌వీర్‌.. రెండు కళ్లుచాలవంటే నమ్మరు!
బీ-టౌన్‌లో అత్యంత రొమాంటిక్‌ కపుల్‌గా పేరొందిన జంట దీపికా పదుకొనె- రణ్‌వీర్‌ సింగ్‌. సుమారు ఐదేళ్ల పాటు ప్రణయ బంధంలో మునిగితేలిన దీప్‌వీర్‌ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది, ఉత్తరాది పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లినాడు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. సవ్యసాచి డిజైన్‌ చేసిన అవుట్‌ఫిట్లు ధరించి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘‘సదా సౌభాగ్యవతి భవ’’ అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.. తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట.

ఇక వీరే కాదు.. కరీనా కపూర్‌(50 లక్షలు), ఊర్మిళా మటోంద్కర్‌(నాలుగున్నర లక్షలు), బిపాసా బసు(4 లక్షలు), దియా మీర్జా(3 లక్షలు), ఇషా డియోల్‌(3 లక్షలు) వంటి నటీమణులు సైతం స్పెషల్‌ డేను అందమైన దుస్తులు ధరించి మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు.

చదవండి: తాను అక్రమ సంతానాన్ని అని తెలుసుకున్న ‘లోకి’ ఏం చేయబోతున్నాడు?
     

మరిన్ని వార్తలు