డబ్బింగ్‌కే పదిహేను రోజులు పట్టింది

27 Sep, 2021 03:20 IST|Sakshi

‘‘రిపబ్లిక్‌’ పక్కా కమర్షియల్‌ మూవీ కాదు.. డిఫరెంట్‌ మూవీ.. రియల్‌ స్టోరీ ఆధారంగా దేవ కట్టాగారు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు 22 రోజులు పని చేశాం. అయితే డబ్బింగ్‌ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది. అంటే.. డైరెక్టర్‌గారు ఎంత పర్‌ఫెక్షన్‌ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అని ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా నటించిన  చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్‌ చెప్పిన విశేషాలు.

► కరోనా సమయంలో ఓ రోజు దేవ కట్టాగారు ఫోన్‌ చేసి, ‘రిపబ్లిక్‌’ స్క్రిప్ట్‌ గంట పాటు చెప్పారు. హైదరాబాద్‌ వచ్చి ఆయన్ని కలిశాక ఐదారు గంటల పాటు కథ చెప్పారు. హీరో, హీరోయిన్‌ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారాయన. ఈ చిత్రంలో మైరా అనే ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. రొటీన్‌గా సాంగ్స్‌ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ట్రాక్‌ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌ కూడా ఉండదు.

► సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్‌ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా. సాయితేజ్‌ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్‌ పెట్టారు. తన కెరీర్‌లో ‘రిపబ్లిక్‌’ బెస్ట్‌ మూవీ అవుతుందని భావిస్తున్నాను.

► ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. పెర్ఫార్మెన్స్‌ అయినా, గ్లామర్‌ రోల్స్‌ అయినా చక్కగా చేస్తారు. అనుష్కగారంటే ఇష్టం. సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్‌ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను.  తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. 

మరిన్ని వార్తలు