నింద వేసిన కొడుకు

12 Jan, 2021 12:50 IST|Sakshi

కోవిడ్‌ మొదలయ్యి భయభ్రాంతం చేస్తున్న రోజుల్లో అమితాబ్‌ దాని బారిన పడి హాస్పిటల్‌లో తీవ్రంగా పోరాడాల్సి రావడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అభిషేక్‌ కూడా కరోనా బారిన పడ్డాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో ఉన్నారు. ఆ సంఘటనతో దేశం అంతా అలెర్ట్‌ అయ్యింది. అమితాబ్‌కే వచ్చినప్పుడు మనక్కూడా రావచ్చని జాగ్రత్తలు పాటించింది. రెండు రోజుల క్రితం సోనీలో వచ్చిన ‘కామెడీ విత్‌ కపిల్‌’షోలో అభిషేక్‌ బచ్చన్, అజయ్‌ దేవ్‌గణ్‌ పాల్గొని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు.

‘కోవిడ్‌ వార్త వెలువడగానే నేను అభిషేక్‌కు ఫోన్‌ చేశాను. గట్టిగా తిట్టేశాను.. జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎవరి వల్ల వచ్చింది అనంటే అభిషేక్‌ కంగారుగా నాన్న వల్లే వచ్చి ఉంటుందని అన్నాడు. అమితాబ్‌ గారు ఇల్లు కదలకుండా ఉంటే ఆయన వల్ల అంటావు మళ్లీ. నువ్వు బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆయన కు వచ్చి ఉంటుంది’ అని బాగా తిట్టాను అని అజయ్‌ దేవ్‌గణ్‌ అన్నాడు. అజయ్‌ దేవ్‌గణ్‌ అమితాబ్‌ కుటుంబానికి బాగా దగ్గర. అభిషేక్‌ను పెట్టి హర్షద్‌ మెహతా బయోపిక్‌ ‘బిగ్‌ బుల్‌’ తాజాగా నిర్మించాడు. దాని ప్రమోషన్‌లో భాగంగా ఈ షోలో పాల్గొని కోవిడ్‌ ఉదంతాన్ని పంచుకున్నారు ఇద్దరూ. అభిషేక్‌ చదువు మానేసి స్విట్జర్లాండ్‌ నుంచి తిరిగి వచ్చి అజయ్‌ హీరోగా నటించిన ‘మేజర్‌ సాబ్‌’ యూనిట్‌లో స్పాట్‌బాయ్‌గా పని చేశాడు. ‘అప్పటి నుంచి అజయ్‌ నాకు అన్నగా మారాడు’ అని చెప్పాడు అభిషేక్‌. 

మరిన్ని వార్తలు