62 దేశాలు, 18 నెలలు.. స్టార్‌ హీరో షాకింగ్‌ నిర్ణయం?

20 Oct, 2022 17:32 IST|Sakshi

నటుడు అజిత్‌ రూటే సపరేటు. ఆయనకు నటన వృత్తి. బైక్‌ రేస్, రైఫిల్‌ షూటింగ్‌ ప్రవృత్తి. అగ్ర కథానాయకుడిగా రాణిస్తునే మరోపక్క మనసుకు నచ్చిన పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. అనంతరం 30 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బైక్‌పై ప్రయాణించి మక్కువను తీర్చుకున్నారు. ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మిస్తున్న తుణివు చిత్ర షూటింగ్‌ పూర్తి చేశారు. ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలింది. నటి మంజు వారియర్‌ నాయకిగా నటిస్తోంది.

బ్యాంక్‌ రాబరింగ్‌ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అజిత్‌ మరోసారి బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన భారీ బైక్‌ ప్రయాణానికి ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 18 నెలల బైక్‌ ప్రయాణంలో అంటార్కిటికా సహా ఏడు ఖండాలు దాటి 62 దేశాలు చుట్టి రానున్నారని సమాచారం. అయితే అంతకుముందు నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించడానికి అజిత్‌ సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత  అజిత్‌ బైక్‌ ప్రయాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏడాదిన్నర పాటు సినీ ప్రపంచానికి దూరంగా ఉండనున్నట్లు తెలిసింది.

చదవండి: Rajeev Kanakala: సంపాదన విషయంలో గొడవలు? రాజీవ్‌ వ్యాఖ్యలు వైరల్‌

మరిన్ని వార్తలు