లక్కీ చాన్స్‌ కొట్టేసిన త్రిష.. ఆ ఇద్దరు స్టార్లతో మరోసారి..   

29 Oct, 2022 09:09 IST|Sakshi

మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న నటి త్రిష ఇటీవల సరైన సక్సెస్‌ లేక సతమతం అయ్యింది. అయితే తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో రీచార్జి అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రంలో కుందవై యువరాణిగా ఎంతో హూందాగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇదంతా దర్శకుడు మణిరత్నం చలవే అని చెప్పక తప్పదు. త్రిష తాజాగా ది రోడ్‌ అనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా ఇప్పుడు మరో రెండు భారీ అవకాశాలు ఈ అమ్మడి తలుపులు తట్టినట్టు తెలుస్తోంది.

దళపతి విజయ్‌ సరసన గిల్లీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష తాజాగా మరోసారి ఆయనతో జతకట్టే అవకాశం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విజయ్‌ 67వ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కథా నాయకిగా నటి త్రిష నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా మరో లక్కీఛాన్స్‌ కూడా ఈ భామను వరించనున్నట్లు తాజా సమాచారం. విజయ్‌కు పోటీగా భావించే నటుడు అజిత్‌ 62వ చిత్రంలో త్రిషను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

అజిత్‌ ప్రస్తుతం తన 61వ చిత్రం తుణివులో నటిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించనున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. ఇందులో నాయకిగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి త్రిష పేరు వినిపిస్తోంది. అజిత్‌కు జంటగా ఈ బ్యూటీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. 
 

మరిన్ని వార్తలు