Chor Bazaar Movie Telugu Review: ఆకాష్ పూరి 'చోర్‌ బజార్‌' సినిమా రివ్యూ..

24 Jun, 2022 13:31 IST|Sakshi
Rating:  

టైటిల్: చోర్ బజార్
నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు
దర్శకుడు: జీవన్‌ రెడ్డి
నిర్మాత: వీఎస్ రాజు
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
విడదల తేది: జూన్ 24, 2022

Chor Bazaar Movie Review

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్‌ బజార్‌' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్‌) అమితాబ్‌ బచ్చన్‌ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్‌ 24)న విడుదైలన 'చోర్‌ బజార్‌' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. 

Chor Bazaar Movie Rating

కథ:
హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్‌ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్‌ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్‌ సాబ్ (ఆకాష్‌ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్‌ బజార్‌లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్‌ సాబ్‌ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్‌ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్‌ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్‌ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్‌ బజార్‌' చూడాల్సిందే.

Chor Bazaar Movie Cast

విశ్లేషణ:
డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి 'జార్జ్‌ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్‌ బజార్‌' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్‌ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్‌ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్‌, చోర్‌ బజార్‌ మనుషుల కథ, ఉమెన్‌ ట్రాఫికింగ్, అమితాబ్‌ బచ్చన్‌ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. 

Chor Bazaar Movie Stills

ఎవరెలా చేశారంటే?
ఆకాష్‌ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్‌ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్‌ ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్‌ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్‌) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్‌ బజార్‌'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. 

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు