Romantic: భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్‌ పూరి

26 Oct, 2021 17:14 IST|Sakshi

ఆడియో ఫంక్షన్ పెట్టండి.. నేను కొంచెం మాట్లాడాలి అని అన్నాను. ఏం మాట్లాడతావ్ రా అని నాన్న అన్నారు. మీరు పెట్టండి అని అన్నాను. స్టేజ్ మీద అలా మాట్లాడే సరికి ఆయన సర్ ప్రైజ్ అయ్యారు. అలా మాట్లాడతాను అని ఊహించలేదు. మమ్మికి, డాడీకి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేశారు. అంత బాగా మాట్లాడాడు ఏంటి? అని అందరూ అనడంతో నాన్న గారు హ్యాపీగా ఫీలయ్యారు’అన్నారు పూరి జగన్నాథ్‌ తనయుడు, యంగ్‌ హీరో ఆకాశ్‌ పూరి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.కేతిక శర్మ హీరోయిన్‌.  అనిల్‌ పాదురి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆకాశ్‌ పూరి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా  వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను.

► ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందే ప్లాన్ చేసుకుని అలా మాట్లాడలేదు. ఆ టైంలో అనిపించింది చెప్పాను అంతే. పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు.. నా పని కూడా అయిపోయిందని అన్నారు.. ఆ మాటలు వింటూ ఉండే వాడిని. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో అంతా వెనక్కి వచ్చింది.

► అనిల్ నాన్న దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయన సీజీ డిపార్ట్మెంట్ చూసుకునే వారు. ఆయన దర్శకత్వం చేస్తారని, అందులో నేను హీరోగా నటిస్తాను అని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు నాన్న(పూరి జగన్నాథ్‌) సడెన్‌గా పిలిచి ఈ సినిమాకు ఆకాష్ హీరో.. నువ్ దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాక్ అయ్యారు. అలా ఓ రెండు రోజులు కలిసి ట్రావెల్ అయ్యాం. తరువాత కనెక్ట్ అయిపోయాం.

► మెహబూబా విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో రొమాంటిక్ ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ  ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రావడంతో సినిమా స్థాయి మారిపోయింది. అలా సినిమాను పూర్తి చేసే సమయానికి లాక్‌డౌన్‌ వచ్చింది. మొత్తానికి అలా ఆలస్యమైంది.

► కరోనా వల్ల ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారా? అని భయపడ్డాను . ఎందుకంటే ఇది అందరితో కలిసి థియేటర్లో కూర్చుని చూసే సినిమా. క్రాక్, ఉప్పెన, లవ్ స్టోరీ వంటి సినిమాలు మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ఊపిరిపోశాయి. ఏది ఏమైనా సరే థియేటర్లకు వచ్చి చిత్రాలు చూస్తామని చాటి చెప్పిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి.

► రొమాంటిక్ సినిమాలో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. రొమాంటిక్ అని టైటిల్ పెట్టినందుకు ట్రైలర్ అలా కట్ చేశాం. కానీ సినిమా విడుదలయ్యాక మౌత్ టాక్ ద్వారా ఇంకా జనాల్లోకి వెళ్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది.

► సినిమాలో ట్విస్ట్‌లాంటివి ఏమీ ఉండవు. కానీ కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్ అవుతారు. వాస్కోడిగామా పాత్రలో కనిపిస్తాను. వాడి రూటే రాంగ్ రూట్. క్రైమ్ డిపార్మెంట్‌లో ఉంటాడు. ఇంత కంటే ఆ క్యారెక్ట‌ర్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను.

► చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. వాస్కోడిగామా అనే పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది.ఈ క్యారెక్ట‌ర్‌ విన్న వెంటనే.. ఎలాగైనా సరే బాగా చేయాలని ఫిక్స్ అయ్యాను. 

► మా నాన్న ఈ సినిమా లైన్‌ను ఎప్పుడో రాసుకున్నారు. ఈ కథలోకే నేను వచ్చాను. రొమాంటిక్ కథను నాకు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి హీరోలందరూ మా నాన్న డైలాగ్స్ చెబుతుంటే ఆనందపడేవాడిని. నేను ఇప్పుడు ఆయన డైలాగ్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది.

► అనిల్‌  ఇది మొదటి సినిమాలా చేయలేదు. ప్రతీ ఒక్కటి ఎంతో క్లారిటీతో చేశారు. ఆయనకు ఈ చిత్రంతో ఎంతో మంచి పేరు వస్తుంది. నాకు తెలిసి ఆయన ఎలాంటి పెద్ద సినిమాను అయినా హ్యాండిల్ చేయగలరు. ఆయనకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు.

► సినిమా చూసి నాన్న గారితో పాటు అందరూ ఎమోషనల్ అయ్యాం. చాలా బాగా వచ్చింది. రేపు సినిమా చూశాక అందరూ అదే ఫీలవుతారు.

► రమ్యకృష్ణతో పని చేయడమే పెద్ద చాలెంజింగ్. ఆమెతో పని చేయడం నా అదృష్ణం, గౌరవంగా ఫీలవుతున్నాను. ఆమెకు నాకు వచ్చే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. నరసింహా సినిమాలో రజినీకాంత్ ముందు ఫెర్ఫామెన్స్ చేసిన ఆవిడ ముందు నేను చేస్తానా? అని అనుకున్నాను. ఆమెతో పని చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నో సార్లు ఆమె ముందు డైలాగ్స్ మరిచిపోయాను. కానీ ఆమె మాత్రం నవ్వుతూనే పర్లేదు టైం తీసుకో అని ఎంకరేజ్ చేశారు.

► ఏం చేయమంటే అది చేస్తాను.. దూకమంటే దూకుతాను.. కానీ ఈ రొమాన్స్ కాస్త తగ్గించు నాన్నా అని అన్నాను. సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా అని అన్నారు. సెట్‌లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా? అని అనిపించింది. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం. 

► మా నాన్న నుంచి ఎంత దూరం పారిపోతే అంత మంచిదని అనిపిస్తుంటుంది. ఇప్పటికే మా నాన్న ఎంతో చేశారు. ఎంతో డబ్బులు పెట్టారు. ఇంత వరకు మా నాన్న చేసింది చాలు.. ఇక నేను మా నాన్నకు చేయాలి. తిరిగి ఇవ్వాలి. నేను సక్సెస్ కొట్టాక అప్పుడు వెళ్లి మా నాన్నతో ఓ సినిమా చేస్తాను.

► నేను అగ్రెసివ్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న కారెక్టర్స్ బాగా చేయగలను అని నాన్న నమ్ముతారు. 

► ప్రభాస్‌కి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుసు. రొమాంటిక్ ప్రమోషన్స్ కోసం మేం ఎవ్వరం కూడా ప్రభాస్‌కి ఫోన్ చేయలేదు. ఆయనే ఫోన్ చేసి అడిగారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌లో ఒక రోజు మొత్తం మాకు ఇచ్చారు. ముంబైకి పిలిపించుకున్నారు. ఆయనతో ఉన్న ఆ ఒక్క రోజును ఎప్పటికీ మరిచిపోలేను.

► నాన్న ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. ఇంకా ఆయన్ను హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. కానీ ఆయన నన్ను ఎప్పుడూ అంతగా మెచ్చుకోరు. ఎంత కష్టపడి షాట్ చేసినా కూడా హా బాగుంది అని సింపుల్‌గా అనేస్తారు. ఎక్కువగా మెచ్చుకోరు. కానీ లోపల సంతోషపడతారు. ఆయన బాగుంది అని అంటే చాలు అదే ఎక్కువ.

► ఇప్పుడు కాదు కానీ ఓ పదేళ్ల తరువాత అయినా సరే దర్శకత్వం చేస్తాను. ముందు నేను హీరోగా నిలబడ్డ తరువాత డైరెక్షన్ చేస్తాను. కథ రాయడం నాకు రాదు. మా నాన్నకు రెమ్యూనరేషన్ ఇచ్చి కథ తీసుకుంటాను. డైరెక్షన్ మాత్రం చేస్తాను.

► సినిమా ప్రపంచం తప్ప మరొకటి తెలియదు. హీరోగా కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయ్యిండే వాడిని. కానీ సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేస్తుండేవాడిని.

► నాకు రజనీకాంత్, చిరంజీవి దేవుళ్లతో సమానం. వారిద్దరూ చాలా ఇష్టం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తాను.

► నేను ఇప్పుడు ఏదో ఒక్క జానర్‌కు పరిమితం కావాలని అనుకోవడం లేదు. నా సినిమాను మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు అందరూ చూడాలని అనుకుంటున్నాను.

► పదేళ్ల అనుభవం ఉన్న నటుడిలా చేశావ్ అంటూ నాకు ప్రభాస్‌ కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాంటి రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

►  మా నాన్న తీసిన సినిమాల్లో నాకు పోకిరి, బిజినెస్ మెన్, నేనింతే అంటే చాలా ఇష్టం.

► చోర్ బజార్ సినిమా చాలా బాగా వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. అందులో కూడా ఇలాంటి సాలిడ్ కారెక్టరైజేషన్ ఉంది. బచ్చన్  సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్రలు ద‌క్క‌డం ఆనందంగా ఉంది. ఆ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో తీస్తున్నాం. కమర్షియల్‌ పరంగా చాలాపెద్దగా ఉంటుంది. అది యాక్షన్ బేస్డ్ ఫిలిం. దాదాపు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు