క్లాస్ అయినా.. మాస్‌ అయినా ఆయనే ‘బాస్‌’

28 Aug, 2021 20:24 IST|Sakshi

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అందం, గ్లామర్‌ అనే పదాలను ఎక్కువగా హీరోయిన్లకు వాడుతాం. కానీ ఆ పదాలను హీరోలకు కూడా వాడొచ్చు అనడానికి నిదర్శనం అక్కినేని నాగార్జున. అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈ అక్కినేని హీరో. టాలీవుడ్‌ లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిశ్రమలో అడుగు పెట్టారు ఆయన. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. నాగ్ అంటే క్లాస్. నాగ్ అంటే మ… మ‌…మాస్‌ అనేలా  అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. లేడీ ఫ్యాన్స్‌కు ‘మన్మథుడు’ ఆయన. బుల్లితెర ప్రేక్షకులకు ‘బిగ్‌బాస్‌’.. ఇలా ప్రతి రోల్‌లో మెప్పించిన ఘనత ఆయనకే చెందుతుంది.

సాహసం చేసి మన్ననలు..
అప్పటి వరకు యంగ్‌ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న నాగ్‌ సడెన్‌గా ‘అన్నమయ్య’, ‘శ్రీరామ దాసు’ వంటి సినిమాల్లో నటించి సాహసం చేశారు. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో నటన ఆయన నట జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక భక్తిరస చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ‘మన్మథుడు’ సినిమాలో హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేసి టాలీవుడ్‌ మన్మథుడిగా మారారు. ఎలాంటి పాత్రలు చేసినా అందులో ఒదిగిపోతూ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు.

చదవండి: PV Sindhu: చిరు ఇంట్లో పీవీ సింధును సత్కరించిన సినీ ప్రముఖులు

అందుకే అప్పటి, ఇప్పటి  హీరోలతో పోలిస్తే నాగార్జున చాలా ప్రత్యేకం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క నటనలోనే కాదు, తనదైన స్టైల్‌, లుక్‌, మ్యానరిజం, వ్యక్తిత్వంలో ఈ అక్కినేని హీరోకి అగ్రస్థానం ఇచ్చారు సినీ అభిమానులు. ఇలా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ‘బాస్‌’ బర్త్‌డే నేడు (ఆగష్టు 29). ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఒకసారి తెలుసుకుందాం...

లిప్‌లాక్‌ సీన్‌లో నటించిన తొలి తెలుగు హీరో..
హిందీ రీమేక్‌ యాక్షన్‌ డ్రామా విక్రమ్‌ (1986) మూవీతో హీరోగా అరంగేట్రం చేసిన నాగార్జున తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ హిట్‌ అందుకున్నారు. ఆ తరువాత మజ్ను, సంకీర్తన, ఆఖరి పోరాటం, జానకి రాముడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. వెంటనే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘గీతాంజలి’ మూవీతో బిగ్‌ హిట్‌ అందుకున్నారు. ఈ మూవీ జాతీయ అవార్డును కూడా అందుకుంది. 

లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించిన తొలి హీరోగా నాగ్‌కు పేరుంది. ఈ మూవీలో హీరోయిన్‌తో రోమాన్స్‌ చేసి ఆ వెంటనే రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ మూవీలో యాక్షన్‌ సీన్స్‌ చేసి యాక్షన్‌ హీరోగా మారారు. ఈ సినిమాతో నాగార్జున సినీ కేరీర్‌ మరో మైలురాయికి చేరుకుంది. శివ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో ఈ మూవీని హిందీలో అదే పేరుతో నాగార్జున హీరోగా రీమేక్‌ అయ్యింది. 

ఆ ఘనత నాగార్జునదే..
అలా బాలీవుడ్‌లో రీమేక్‌ అయిన తొలి తెలుగు చిత్రంగా శివ మూవీ నిలిచింది. టాలీవుడ్‌ సినిమాను ఉత్తరాదికి తీసుకువెళ్లిన ఘనత కూడా నాగార్జునదే. ఆ తర్వాత ఆయన నటించిన క్రిమినల్‌, ఆజాద్‌ చిత్రాలు కూడా హిందీలో నాగార్జున రీమేక్‌ చేశారు.  ఈ క్రమంలో ఆయన హీరోగా నేరుగా బాలీవుడ్‌లో ‘ఖుదా గవా ‘మిస్టర్‌ బెచార’ వంటి సినిమాలు తెరకెక్కడం విశేషం. 

దీంతో డైరెక్ట్‌గా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన తొలి తెలుగు హీరోగా నాగ్‌ చరిత్ర సృష్టించారు. అంతేగాక పలువురు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను తెలుగు తెరకు పరిచయం చేసి ట్రాక్‌ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు ఈ ‘బాస్‌’. జూహి చావ్లా, సుస్మితా సేన్‌, మనీషా కోయిరాల, ఐశ్వర్యారాయ్‌, శిల్పా శెట్టి, రవీనా టాండన్‌, అయేషా టకియాతో రొమాన్స్‌ చేయడమే చేశారు. అంతేగాక ‘ఎం టీవీ’ యాంకర్‌ షెహనాజ్‌ను ఎదురు లేని మనిషి మూవీతో పరిశ్రమకు పరిచయం చేశారు.  

అందుకే సినీ పరిశ్రమలో నాగ్‌కు ప్రత్యేక స్థానం!
60 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలతో పోటీ పడుతూ మన్మథుడుగా పిలిపించుకుంటున్నారు నాగ్‌. ఇటీవల వైల్డ్‌డాగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నాగార్జున ప్రస్తుతం హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీతోపాటు తెలుగులో బంగార్రాజు వంటి పలు సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఇలా సినిమాలతో నేటీ యువ హీరోలు కూడా చేయని ప్రయోగాలు చేసి తనదైన నటనతో భారత సినీ పరిశ్రమలో ‘నాగార్జున అక్కినేని’ అంటే ఓ బ్రాండ్‌లా మారిపోయారు. అందుకే నాగార్జున తనదైన స్పెషాలిటీతో పరిశ్రమలో స్పెషల్‌ వన్‌గా నిలిచారు.

చదవండి: Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు?

మరిన్ని వార్తలు