అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా

26 Sep, 2022 04:29 IST|Sakshi
అఖిల్, నాగార్జున, నాగచైతన్య

-నాగార్జున

‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ సినిమాతో సైకిల్‌ చైన్‌ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్‌’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. విజయదశమి మా ‘ది ఘోస్ట్‌’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది.

కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్‌ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్‌ చెప్పాలి. ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్‌’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్‌ టీఆర్‌పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. నెక్ట్స్‌ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్‌ అవుతుంది.
మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ కూడా అక్టోబరు 5న రిలీజ్‌ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్‌’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్‌’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్‌’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్‌ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు.

హీరో అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్‌ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్‌’ లో ఏదో ఒక ఫైర్‌ ఉంది.. సినిమా సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్‌’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్‌రావు. ‘‘ది ఘోస్ట్‌’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్‌ మరార్‌. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, సోనాల్‌ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్‌ ముఖేష్, ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మకడలి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మార్క్‌ కె రాబిన్, మ్యూజిక్‌ డియో భరత్, సౌరభ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు