ముప్ఫై తొమ్మిదేళ్లకు రిలీజవుతున్న ప్రతిబింబాలు

3 Apr, 2021 00:11 IST|Sakshi
జయసుధ,అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, జయసుధ, తులసి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిబింబాలు’. కె.ఎస్‌. ప్రకాష్‌ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ‘వియ్యాలవారి కయ్యాలు, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం’ వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమా 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం.

రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ – ‘‘1982 సెప్టెంబర్‌ 4న ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో కొత్తగా ఉందనిపించి, ఈ చిత్రకథని ఎన్నుకున్నాం. అయితే ఇప్పటికీ అలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏయన్నార్‌ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం అలరిస్తుంది. మేలో సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్‌.

మరిన్ని వార్తలు