రైతు దీక్షలు: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

4 Feb, 2021 14:42 IST|Sakshi

ఎవర్ని ఎవరు కాపీ కొట్టారో తెలీడం లేదే

సోషల్‌ మీడియా వేదికగా ట్విటర్‌ వార్‌

సాక్షి, ముంబై: రైతు ఉద్యమానికి మద్దతిస్తూ.. అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు బుధవారం ఇండియాలో కలకలం రేపాయి. మా అంతర్గత విషయంలో మీ జోక్యం ఏంటి అంటూ క్రీడా, సినీ రంగ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతి విద్వేశ ప్రచారం నుంచి దేశాన్ని కాపాడే బాధ్యతలో సెలబ్రిటీలు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌, అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌, సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజాలు సోషల్‌ మీడియాలో ‘ఇండియాటుగెదర్’‌ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ‘‘రైతుల ఉద్యమాన్ని సాకుగా తీసుకుని దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ’’ సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ఇండియాటుగెదర్‌ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేశారు. వీరిదిలా సాగుతోంటే మరోవైపు దిల్జిత్ దోసాంజ్‌, కంగనా రనౌత్‌ల మధ్య మరో రచ్చ నడిచింది. 

ఈ నేపథ్యంలో కొందరు నెటిజనులు మరో ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చి.. సెలబ్రిటీలను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకు వారు గుర్తించిన ఆ ఆసక్తికర అంశం ఏంటంటే ఇండియాటుగెదర్‌లో భాగంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నేహ్వాల్‌ చేసిన ట్వీట్స్‌ రెండు ఒకేలా ఉన్నాయి. అక్షరం పొల్లు పోకుండా.. సేమ్‌ టూ సేమ్‌ ఉన్నాయి. వీటిని చూసిన నెటిజనుల ‘‘ఎవర్ని ఎవరు కాపీ కొట్టి ఉంటారో అర్థమై చావడం లేదే’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇ‍ద్దరి ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ తీసి రీ ట్వీట్‌ చేస్తూ.. ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ట్వీట్స్‌ మాత్రమే కాక మొత్తం బాలీవుడ్‌ సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్‌ అన్ని సేమ్‌ ఒకేలా ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాక దేశంలో పలు ముఖ్యమైన అంశాలపై కామ్‌గా ఉండే బాలీవుడ్‌.. రైతుల ఉద్యమం అంశంలో మాత్రం మూకుమ్ముడిగా స్పందించడం ఏంటో అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
(చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్‌ వార్‌)

అయితే సెలబ్రిటీల తీరును మరి కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు ఖండిస్తున్నారు. సెలబ్రిటీలంతా ఒకే సమయంలో ఒకేలాంటి ట్వీట్లు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్ని పేయిడ్‌ ట్వీట్లు.. లేదా బలవంతంగా.. ఒత్తిడి చేయడం వల్ల ఇలా ట్వీట్‌ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ తాప్సీ పన్ను చేసిన ట్వీట్‌ ఆలోచన రేకెత్తిస్తోది. ‘‘ఒక ట్వీట్ మీ ఐక్యతను  దెబ్బతీస్తే, ఒక జోక్ మీ విశ్వాసాన్ని.. ఒక ప్రదర్శన మీ మత విశ్వాసాన్ని కించపరిస్తే.. అప్పుడు మీరు ప్రచార గురువుగా మారడానికి బదులు.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలి’’ అంటూ ట్వీట్‌ చేశారు. 
(చదవండి: కోహ్లి మద్దతు.. నెటిజనుల విమర్శలు)

ఇక రైతులకు మద్దతుగా నిలిచిన నటి స్వరా భాస్కర్‌ ప్రతీ అంశంలో బాలీవుడ్‌ని నిరంతరం ప్రశ్నిస్తున్న వారిని ఎద్దేవా చేస్తూ.. మరో ట్వీట్‌ చేశారు. ‘రైతులకు మద్దతుగా నిలబడండి.. ఈ అంశంపై బాలీవుడ్‌ స్పందించాలి అనే వారికి ఇదిగో సమాధానం.. ఇప్పడేం అంటారు’ అంటూ స్వరా వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు