పాట కోసం బ్రేక్‌

3 Feb, 2021 08:42 IST|Sakshi

హిందీ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ముఖ్యంగా కథ డిమాండ్‌ చేస్తే పాటల చిత్రీకరణ విషయంలో ఆయన అస్సలు రాజీపడరు. భారీ సెట్లతో బోలెడంత హంగామా ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ ‘పద్మావత్‌’లోని దీపికా పదుకోన్‌ చేసిన. ‘ఘూమర్‌..’ పాట ఒకటి. ప్రస్తుతం ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయ్‌ కఠియావాడీ’. ఈ  సినిమా కోసం రెండు పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. అందులో ఒకటి చాలా క్లిష్టమైన పాట అని సమాచారం. స్టెప్స్‌ కఠినంగా ఉంటాయట.

అందుకే ఆలియాకి రెండు వారాలు ఈ సినిమా చిత్రీకరణ నుంచి బ్రేక్‌ ఇచ్చారని టాక్‌. ఈ రెండు వారాలూ స్టెప్స్‌ ప్రాక్టీస్‌ చేసి, చిత్రీకరణలో పాల్గొంటారామె. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్‌ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గంగూబాయ్‌ పాత్రను ఆలియా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబయ్‌ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్‌ వేశారు. సెట్‌లో ఆలియా, 200 మంది డ్యాన్సర్లు పాల్గొనగా పాట చిత్రీకరణను ప్లాన్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు