ఐదు కోట్ల ప్రేమ

27 Oct, 2020 01:05 IST|Sakshi

‘‘మన చుట్టూ ఉన్నవాళ్లతో, మనతో మనం ఏర్పరుచుకునే బంధాలే మన జీవితం. నువ్వు అదీ  ఇదీ.. అలా ఇలా అని తక్కువ చేసే అర్హత ఎవ్వరికీ ఉండదు. మరీ ముఖ్యంగా కీబోర్డ్‌ వెనక దాక్కునేవాళ్లకు (సోషల్‌ మీడియాలో విమర్శలు చేసేవాళ్లను ఉద్దేశిస్తూ)’’ అన్నారు ఆలియా భట్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా 50 మిలియన్ల అభిమానులను (5 కోట్ల మంది) సంపాదించుకున్నారామె. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ –‘‘నాకు 50 మిలియన్లు ప్రేమను అందించిన అభిమానులందరికీ నా ప్రేమను ఇస్తున్నాను. ఈ సందర్భంగా గత కొన్ని నెలల్లో నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సోషల్‌ మీడియా మనందర్నీ ఒక్కచోట చేరుస్తుంది. కనెక్ట్‌ చేస్తుంది.

వినోదం ఇస్తుంది. కానీ అందులో ఉండేది నిజమైన మనం కాదు. అది మనం కానే కాదు. అందుకే ఇప్పుడు ఐదు కోట్ల మంది చూపించిన అభిమానానికి ఎంత ఆనందపడ్డానో ఒకప్పుడు ఐదు వేల మంది, యాభైవేల మంది, యాభై లక్షలమంది ఉన్నప్పుడూ అంతే ఆనందపడ్డాను. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకంటూ కొంత టైమ్‌ కేటాయించుకుని మీ శరీరాన్ని, మనసుని అభినందించండి. మీరేంటో తెలుసుకోండి. ఎందుకంటే సోషల్‌ మీడియాలో వచ్చే ఒక లైక్, డిస్‌లైక్, ఒక అభినందన, ఒక విమర్శ... వీటి తాలూకు ప్రభావం మీ మీద పడకూడదు’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వారసత్వం గురించి జరిగిన చర్చలో ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్‌భట్‌ కుమార్తెగా ఆలియా సోషల్‌ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అవి తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని చెప్పడానికే ఆలియా భట్‌ ఈ విధంగా చెప్పి ఉంటారని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా