Alipiriki Allantha Dooramlo Movie Review: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ

18 Nov, 2022 16:31 IST|Sakshi

టైటిల్‌: ‘అలిపిరికి అల్లంత దూరంలో’
నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ, వేణుగోపాల్ 
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
దర్శకత్వం: – ఆనంద్ జె
సంగీతం : ఫణి కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: డిజికె
విడుదల తేది: నవంబర్‌ 18, 2022

నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై  రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్‌ జె దర్శకత్వం వహించాడు. నవంబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం  ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం. 

కథేంటంటే:

 తిరుపతికి చెందిన వారది (రావణ్ నిట్టూరు)  ఓ మిడిల్‌ క్లాస్‌ యువకుడు. ఫైనాన్సియల్ గా ఎన్నో ప్రొబ్లెమ్స్ ఉన్నందున చిన్న చిన్న మోసాలు చేస్తూ  వెంకటేశ్వర స్వామి పటాలు అమ్మే షాప్ రెంట్ కు తీసుకొని మెయింటైన్ చేస్తుంటాడు. అక్కడే వెంకటేశ్వర గోశాలలో వాలెంటరీగా పని చేసే ధనవంతుల కుమార్తె కీర్తి ( శ్రీ నికిత)  ను చూసి ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి  తండ్రి.. వారదికి వార్నింగ్‌ ఇస్తాడు.  ‘నీకు చదువు లేకపోయినా , డబ్భైనా ఉంటే  నా కూతురిని ఇచ్చే వాడిని. రెండూ లేవు. ఇకపై నా కూతురి జోలికి రావొద్దు’అని హెచ్చరిస్తాడు. దీంతో వారది బాగా డబ్బులు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.  దొంగతనం చేయాలని డిసైడ్‌ అవుతాడు. అదే సమయంలో శ్రీవారికి రూ. 2 కోట్ల  ముడుపుల మొక్కు చెల్లించుకోవడానికి  వచ్చిన యాత్రికుడి కుటుంబం గురించి తెలుసుకొని ఆ రెండు కోట్లు కొట్టేయాలని ప్లాన్‌ చేసుకుంటాడు. ఈ క్రమంలో వారది అనుకోకుండా చాలా సమస్యల్లో ఇరుక్కుంటాడు. వాటిని ఎదుర్కొనే క్రమంలో వారది జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి? వీటన్నిటినీ  వెంకటేశ్వర స్వామి ఎలా గేమ్ ప్లాన్ చేశాడు, అలాగే యాత్రికుడు మొక్కుకున్న ముడుపులు మొక్కు చెల్లించు కున్నాడా లేదా ? చివరకు వారధి తిరుమలలో  షాప్ ను సొంతం  చేసుకుని కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కలను నెరవేర్చుకొన్నాడా  లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే... 
ఒకరిని మోసం చేస్తే.. కాలమే సమాధానం చెబుతుంది అనే విషయాన్ని తెలియజేసే కథే ‘అలిపిరికి అల్లంత దూరంలో.’. తిరుమలలో ఒక షాపు సంపాయించుకోవాలని చూసే ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృతం గా తీసుకొని రాబారీ డ్రామాలో డివైన్ ఎలిమెంట్ థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు ఆనంద్ జె ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  కథలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ముఖ్యంగా క్లైమాక్స్ బాగున్నప్పటికీ  కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. తెరపై చూపించడంతో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అయితే ఇందులో నటించిన వారంతా  కొత్తవాళ్లే అయినా.. వారి నుంచి మంచి నటనను రాబట్టుకోవడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. 

ఎవరెలా చేశారంటే.. 
వారధి పాత్రకు రావణ్ నిట్టూరు న్యాయం చేశాడు. రావన్‌కి ఇది తొలి చిత్రమే అయినా..  న్యాచురల్ గా చాలా  చక్కగా నటించాడు.కీర్తి  పాత్రలో  శ్రీ నికిత ఉన్నంతలో చక్కటి పెర్ఫార్మన్స్ చూపించింది.హోటల్ బిజినెస్ మ్యాన్ గా బొమ్మకంటి రవీందర్ , ముడుపులు మొక్కు కచ్చితంగా తీర్చుకోవాలి అని పట్టుబట్టిన  పాత్రలో నటించిన అమృత వర్షిణి సోమిశెట్టి , హీరోయిన్ కీర్తి తల్లి తండ్రులు గా జయచంద్ర, తులసి లు,  వారధి తల్లి పాత్రలో  లహరి గుడివాడ నటించి అందరినీ మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే..  ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది.  పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.  సినిమాటోగ్రాఫర్‌ డిజికె పనితీరు బాగుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అందమైన  లొకేషన్స్ లతో పాటు తిరుపతిలో యాత్రికుల మధ్య షూటింగ్ చేస్తూ తిరుపతి నేటివిటీని అద్భుతంగా చూపించారు. అలాగే ఈ చిత్రంలో ప్రతి సీన్ లో వేంకటేశ్వర స్వామీ రిఫరెన్స్ కనిపిస్తుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు