కృష్ణకు నివాళిగా రేపు షూటింగ్స్‌ బంద్‌!

15 Nov, 2022 16:59 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ తెలుగు చిత్రపరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు షూటింగ్స్‌ బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది.

కాగా ఘట్టమనేని కృష్ణ 1943లో మే 31 జన్మించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం ఆయన స్వస్థలం. 1965వ సంవత్సరంలో “తేనె మనసులు” చిత్రంతో హీరోగా కెరీర్‌ ప్రారంభించారు కృష్ణ. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు 350 సినిమాలలో హీరోగా నటించారు. ఈస్ట్‌మన్‌కలర్, 70MM, DTS సౌండ్, సినిమా స్కోప్‌లను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పద్మాలయా స్టూడియోస్, పద్మాలయా ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి అన్ని భారతీయ భాషలలో అనేక చిత్రాలను నిర్మించారు.

2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో “పద్మభూషణ్”, 1974లో ఉత్తమ నటుడిగా “అల్లూరి సీతారామరాజు” సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. అలాగే 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ - సౌత్‌తో పాటు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1989లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు.

చదవండి: కృష్ణ నటించిన ఆఖరి చిత్రం ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు