Once Upon a Village Review: ఇది ఒక్క ఊరి కథ కాదు, మన దేశంలోని ఎన్నో ఊళ్ల కథ!

27 Nov, 2022 15:17 IST|Sakshi

పర్యావరణ ప్రేమికులకు ప్రీతిపాత్రమైన ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆల్‌ లివింగ్‌ థింగ్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఎఎల్‌టీఇఎఫ్‌ఎఫ్‌). రెండు సంవత్సరాల క్రితం ఈ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. తాజా ఫిల్మ్‌ఫెస్టివల్‌లో దేశవిదేశాలకు చెందిన 55 చిత్రాలను దిల్లీ, ముంబై, బెంగళూరులాంటి ప్రధాన నగరాలలో ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి సౌందర్యాన్ని వెండితెర మీదికి తీసుకురావడంతో పాటు వర్తమానానికి సంబంధించి పర్యావరణ సంక్షోభం గురించి ఆలోచన రేకెత్తించడం ఈ చిత్రోత్సవం ఉద్దేశం. ఇందులో  ఏక్‌ థా గావ్‌/వన్స్‌ అపాన్‌ ఏ విలేజ్‌ ఫీచర్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ప్రదర్శించబడుతుంది. 

ఆ ఊళ్లో... శ్రిష్ఠి లఖేర తొలి ఫీచర్‌ డాక్యుమెంటరీ... ఏక్‌ థా గావ్‌/వన్స్‌ అపాన్‌ ఏ విలేజ్‌. ఈ డాక్యుమెంటరీ సియోల్‌ ఎకో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఆడియన్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌’ గెలుచుకుంది. కేరళలో జరిగిన ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ అండ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘స్పెషల్‌ జ్యూరీ’ అవార్డ్‌ గెలుచుకుంది.

ఈ చిత్రం విషయానికి వస్తే...హిమాలయ పర్వతప్రాంతంలోని ఒక పురాతన గ్రామం సెమ్ల. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలతో కళకళలాడిన ఈ ఊరు చిన్నబోయింది. నోరు మూగబోయింది. ఎటుచూసినా విషాద నిశ్శబ్దమే. దీనికి కారణం ఈ ఊళ్లోని వాళ్లు బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టడం. కేవలం అయిదుగురు మాత్రమే ఈ ఊళ్లో ఉంటున్నారు! ఆ అయిదుగురిలో 80 సంవత్సరాల లీలాదేవి, 19 సంవత్సరాల గోలు ఉన్నారు. అయిన వాళ్లందరూ పట్నంలో బతుకుతుంటే ఊళ్లో లీలాదేవి ఒంటరిదైపోతుంది. వృద్ధాప్య సమస్యలు, ఒంటరితనంతో ఆమె బాధపడుతుంటుంది. పట్నంలో ఉంటున్న కుమార్తె రమ్మంటున్నా తాను వెళ్లదు. ఎందుకంటే ఊరిని విడిచి వెళితే అమ్మను విడిచి వెళ్లినట్లుగా ఉంటుంది తనకు!


శ్రిష్ఠి లఖేర

నిజానికి ఇది ఒక్క ఊరి కథ కాదు మన దేశంలోని ఎన్నో ఊళ్ల కథ. బతుకుదెరువు నుంచి పిల్లల చదువుల వరకు రకరకాల కారణాలతో ప్రజలు సొంత ఊళ్లు విడిచి వెళుతున్నారు. దీంతో ఆ ఊళ్లు జనసంచారం లేక పాడుబడ్డ ఊళ్లుగా మారుతున్నాయి. అరవై నిమిషాల ఈ చిత్రం భావోద్వేగ ప్రయాణం. జ్ఞాపకాల సమాహారం.  శ్రిష్టి తల్లిదండ్రుల స్వగ్రామం సెమ్ల. లాక్‌డౌన్‌ సమయంలో తల్లిదండ్రులతో కలిసి చాలారోజులు ఈ గ్రామంలోనే ఉంది శ్రిష్ఠి. లీల దీనస్థితిని చూసిన తరువాత, మాట్లాడిన తరువాత చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది.

మరిన్ని వార్తలు