మహర్షితో ఆ ధైర్యం వచ్చింది

4 May, 2023 01:03 IST|Sakshi

– ‘అల్లరి’ నరేశ్‌

‘‘అల్లరి’తో మొదలైన నా కెరీర్‌లో ‘ఉగ్రం’ 60వ చిత్రం. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో నేర్చుకున్నాను. 60 సినిమాలు చేయడం అంత సులభం కాదు.. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యపడింది.

ఈ ప్రయాణంలో బాపుగారు, కె. విశ్వనాథ్‌గారు వంటి లెజెండరీ దర్శకులతో పాటు, వంశీగారు, కృష్ణవంశీగార్లతో పని చేసే చాన్స్‌  రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్‌ జంటగా సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్‌ పంచుకున్న విశేషాలు.

► మహేశ్‌బాబుగారి ‘మహర్షి’ సినిమాకి ముందు నేను చేసిన పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయి. ‘మహర్షి’లో నా పాత్ర సీరియస్‌గా, సింపతీగా ఉన్నా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఇలాంటి పాత్రల్లోనూ ఆడియన్స్‌ ఆదరిస్తారనే ధైర్యం నాకు కలిగింది. రచయితలకు కూడా నమ్మకం కలగడంతో నా కోసం కామెడీ కాకుండా సీరియస్‌గా ఉండే కొత్త కథలు రాయడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ‘నాంది’ హిట్‌ అయింది. ఇప్పుడు ‘ఉగ్రం’ తర్వాత మరిన్ని కొత్త కథలు నా కోసం రాస్తారనే నమ్మకం ఉంది.

► కామెడీ పాత్రలు చేయడం సులభం అనుకుంటారందరూ. కానీ చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏ పాత్రయినా చేయగలరు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందంగారు, ‘విడుదల’ చిత్రంలో సూరి అద్భుతంగా చేశారు. ‘ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్‌ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా నాకు చెప్పడంతో జాగ్రత్తలు తీసుకొని ‘ఉగ్రం’ చేశాను. మనల్ని దర్శకుడు నమ్మితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. నన్ను క్రిష్‌గారు నమ్మడంతో ‘గమ్యం’, సముద్రఖనిగారు నమ్మడంతో ‘శంభో శివ శంభో’ వచ్చాయి. ఇప్పుడు విజయ్‌కి నాపై ఉన్న నమ్మకంతో ‘నాంది, ఉగ్రం’ వచ్చాయి.

► ‘ఉగ్రం’ ఐదేళ్ల టైమ్‌ లిమిట్‌లో జరుగుతుంది. ఎస్‌ఐ శిక్షణలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి, ఒక కూతురు.. ఇలా మూడు వేరియేషన్స్‌లో ఉండే శివకుమార్‌ పాత్రలో కనిపిస్తాను. యాక్షన్‌ సీన్స్‌ని డూప్‌ లేకుండా చేశాను.

► మనకి సమస్య వస్తే పోలీస్‌ దగ్గరికి వెళ్తాం. అదే పోలీస్‌కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్‌ చేస్తాడనేది ‘ఉగ్రం’లో ఉంటుంది. సస్పెన్స్, యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్‌ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది.

► కామెడీ, సీరియస్‌.. ఏదీ సేఫ్‌ జోనర్‌ కాదు. ‘సుడిగాడు, బెండు అప్పారావు, కితకితలు’ వంటి హిట్‌ సినిమాలు చూసినప్పుడు ‘నరేశ్‌ సినిమా బావుంది అన్నారు కానీ నరేశ్‌ కామెడీ బాగా చేశాడనలేదు’. కానీ ‘గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ చూశాక ‘నరేశ్‌ బాగా నటించాడు’ అన్నారు. కామెడీ చేసేవాళ్లంటే ఇండస్ట్రీలో, ఆడియన్స్‌లో ఎక్కడో చిన్న చూపు ఉంది. ఈ విషయంలో నాకెక్కడో చిన్న గిల్ట్‌ ఫీలింగ్‌ ఉంది.

► ‘వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు’ అని మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు చెప్పారు. నాన్నగారు చెప్పినట్లు నాకు పని తప్ప మరో ఆలోచన లేదు. ఈవీవీగారి బ్యానర్‌లో నాన్నగారి మార్క్‌ సినిమాలు చేయాలి. సరైన కథ కుదిరితే నిర్మిస్తాను. నా సోదరుడు ఆర్యన్‌ రాజేశ్‌ తనని తాను నిరూపించుకునేందుకు సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు దర్శకత్వం ఆలోచన ఉంది కానీ అందుకు టైమ్‌ పడుతుంది.. అయితే నేను దర్శకత్వం వహించే మూవీలో నేను నటించను.

► నా సినిమాల్లో ‘సుడిగాడు’కి సీక్వెల్‌ తీయొచ్చు. ఆ మూవీకి పని చేసిన అనిల్‌ రావిపూడి మొన్న కలసినప్పుడు ‘సుడిగాడు 2’ చేద్దామా? అన్నాడు. ‘నేను రూటు మార్చితే మళ్లీ కామెడీవైపు తీసుకెళ్తారా?’ అని సరదాగా అన్నాను. నాన్నగారి చివరి రోజుల్లో ‘అలీబాబా అరడజను దొంగలు’ మూవీకి సీక్వెల్‌గా ‘అలీబాబా డజను దొంగలు’ సినిమా చేద్దామనుకున్నాం.. కానీ, కుదరలేదు. ప్రస్తుతం నేను, ఫరియా అబ్దుల్లా ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బుగారి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. ‘జెండా’ అనే కథని కొన్నాను.. నేనే నిర్మిస్తా. అలాగే విజయ్‌తో మరో సినిమా ఉంటుంది.

మరిన్ని వార్తలు