ఉగ్రం నా కెరీర్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌ ఫిల్మ్‌ అవుతుంది

5 May, 2023 04:21 IST|Sakshi
సాహు, విజయ్, ‘అల్లరి’ నరేశ్, హరీష్‌

‘‘నేను పోలీసాఫీసర్‌గా చేసిన ‘కత్తి కాంతారావు’, ‘బ్లేడ్‌ బాజ్జీ’ చిత్రాలు విజయాలు సాధించాయి. అయితే ఇవి కామెడీ చిత్రాలు. కాగా నేను సీరియస్‌ పోలీస్‌ పాత్ర చేసిన ‘ఉగ్రం’ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ఉగ్రం’ నా కెరీర్‌లో హయ్యస్ట్‌ గ్రాసర్‌ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను చేసిన ఫైట్స్‌ నవ్వించడం కోసం... ఈ సినిమాలో ఎమోషన్‌ కోసం యాక్షన్‌ సీన్స్‌ చేశాను’’ అన్నారు. ‘‘నాంది’ సినిమాకు మూడురెట్ల వసూళ్లు ‘ఉగ్రం’ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది’’ ఉన్నారు విజయ్‌ కనకమేడల. ‘‘భారతదేశ వ్యాప్తంగా మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ మిస్సింగ్స్‌ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పక్కా ఆధారాలతో వాస్తవ ఘటనలను బేస్‌ చేసుకుని ‘ఉగ్రం’ కథ రెడీ చేశాం’’ అన్నారు రచయిత వెంకట్‌.

కామెడీ సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. నా తర్వాతి సినిమా కామెడీ జానర్‌లోనే ఉంటుంది. అయితే కొందరు నాకు కామెడీ కథలు చెప్పేటప్పుడు వాళ్లకు వాళ్లే ఎగ్జయిట్‌ అయ్యి, నవ్వేసుకుంటున్నారు. నాకు నవ్వు రావడం లేదు. ఆడియన్స్‌ ఆర్గానిక్‌ కామెడీని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ‘కితకితలు’ సినిమా చేస్తే బాడీ షేమింగ్‌ అని తిడతారు. కుటుంబసమేతంగా చూసే కామెడీ సినిమాలు తీయాలన్నప్పుడు అందులో అసభ్య పదజాలం, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉండకూడదు. చెప్పాలంటే కామెడీ సినిమాల రైటర్స్‌ తగ్గిపోయారు.
 – ‘అల్లరి’ నరేశ్‌

మరిన్ని వార్తలు