భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే..

15 Mar, 2021 09:40 IST|Sakshi

‘‘ఈ సినిమాలో భర్త చనిపోయిన ఓ యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ కథను సెంటిమెంటల్‌గా దర్శకుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాడు? అన్నది సినిమాలో తెలుస్తుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగా చేశాడు. ఈ సినిమా సక్సెస్‌ ఫంక్షన్‌ చేసుకుంటామన్న నమ్మకం ఉంది. అలాగే అక్టోబరు నుంచి డేట్స్‌ ఉంచమని కార్తికేయకు ఫోన్‌ చేసి చెప్పాను.. థ్యాంక్స్‌ సార్‌ అన్నాడు’’ అని అన్నారు అల్లు అరవింద్‌. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా జ్యూక్‌బాక్స్‌ విడుదల కార్యక్రమంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిట్, ఫ్లాప్‌ గురించి ఆలోచించకుండా బస్తీ బాలరాజు క్యారెక్టర్‌ చేయాలనుకున్నాను.  బన్నీ (అల్లు అర్జున్‌) కంటే అరవింద్‌గారే యూత్‌ఫుల్‌గా ఉన్నారనిపిస్తుంటుంది నాకు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త దర్శకుడికి ఇంతకన్నా మంచి లాంచ్‌ దొరకదని నేను అనుకుంటున్నాను’’ అన్నారు కౌశిక్‌. ‘‘మాస్‌ డైరెక్టర్ల మధ్య తిరిగే క్లాస్‌ కథ ఈ సినిమా. కార్తికేయ యాక్టింగ్‌ నేచురల్‌గా అనిపించింది.

ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా మాకు తెలి సింది. అరవింద్‌గారికి సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఆలోచిస్తాం. డబ్బులు కన్నా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైతేనే బాగుంటుందని నమ్ముతాం మేం. ఇండస్ట్రీ బాగుండాలి. అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఆహ్లాదకరమైన పోటీ మంచిదే. కానీ అనవసర రాజకీయాలు చేయొద్దు’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఈ కార్యక్రమంలో ఆమని, లావణ్యా త్రిపాఠీ పాల్గొన్నారు.
సక్సెస్‌ ఫంక్షన్‌ చేసుకుంటామనే నమ్మకం ఉంది
– నిర్మాత అల్లు అరవింద్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు