అలా చేస్తే చేటు తప్పదు

5 Jun, 2022 04:56 IST|Sakshi
ఎస్‌కేఎన్, రాశీ ఖన్నా, గోపీచంద్, అల్లు అరవింద్, మారుతి, బన్నీ వాసు

– అల్లు అరవింద్‌

‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్‌ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్‌లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్‌లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు.

‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్‌ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్‌’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్‌ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్‌. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్‌ టైన్‌మెంట్‌కు మంచి యాక్షన్‌ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్‌ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్‌కేఎన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు