రెమ్యునరేషన్‌ వదులుకోవడమే కాకుండా తిరిగి డబ్బులు ఇచ్చాడు: అల్లు అరవింద్‌

16 Nov, 2022 13:54 IST|Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాత హీరో అని కొనియాడాడు.

‘నేను సినిమాలు  తీయడానికి వచ్చినప్పటి నుంచి ఆయనను(కృష్ణ) గమనిస్తున్నాను. ఆయన చనిపోయాడనే వార్త వినగానే.. ఆయన చేసిన గొప్ప విషయం గుర్తుకు వచ్చింది.  ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ ఇవ్వకముందే సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడు కృష్ణ వాళ్లని పిలిచి ‘మీరేదో కష్టాల్లో ఉన్నారట కదా.. నన్ను ఏమైనా సాయం చెయ్యమంటారా?’అని అడిగి డబ్బులు ఇచ్చి మరీ సినిమాలు విడుదల చేశారు.

 ఆ నిర్మాతలు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి పేర్లు ప్రస్తావించదలచుకోలేదు. నిర్మాతల బాగోగులు కోరుకునే గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకు లేడు. అది మన దురదృష్టం.  ఆయన నివాళికి కుటుంబు సభ్యులు, సినీ ప్రముఖులతో పాటు లక్షల మంది అభిమానులు రావడం నిజంగా విచిత్రం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని అల్లు అరవింద్‌ అన్నారు.

మరిన్ని వార్తలు