ఓ వ్యక్తి చేసినదానికి ఇండస్ట్రీని తిట్టొద్దు.. సంతోషం అవార్డుల వివాదంపై నిర్మాత సీరియస్‌

4 Dec, 2023 14:06 IST|Sakshi

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో విలేఖరి సురేశ్‌ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్‌ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్‌ రసాభాసగా జరగడంతో టాలీవుడ్‌ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. 

కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు
ఈవెంట్‌ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్‌గా లైట్స్‌ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్‌ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్‌ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించాడు.

ఒక వ్యక్తి చేసిన పొరపాటు
'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్‌ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్‌కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్‌ కాదు. అలాగే  మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు.

చదవండి: జపాన్‌ అఫీషియల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్‌

>
మరిన్ని వార్తలు