మా స్నేహం అలానే ఉంది

10 Jan, 2021 00:27 IST|Sakshi
అశ్వినీ దత్, శ్రీ గౌరీప్రియ, అల్లు అరవింద్, ఉదయ్, స్వప్నా దత్‌

– అల్లు అరవింద్‌

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్‌’. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్‌ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్‌ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్‌ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే.

ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్‌ సిరీస్‌ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌ రష్‌ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్‌ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్‌ గారు పిలిచి వెబ్‌ సిరీస్‌ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్‌ చాన్స్‌ అని చెప్పాను’’ అన్నారు.

స్వప్నాదత్‌ మాట్లాడుతూ– ‘‘పార్టనర్‌షిప్‌ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్‌ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్‌ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్‌షిప్‌ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్‌ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్‌ సినిమా స్టైల్లో ఉదయ్‌ ‘మెయిల్‌’ను తెరకెక్కించారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు