పచ్చందనమే పచ్చదనమే... తారలు ఏమంటున్నారంటే?

6 Jun, 2021 01:19 IST|Sakshi

పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే... చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చందమనే పచ్చదనమే.. అంటూ ఉల్లాసంగా ఉండొచ్చు. శనివారం (జూన్‌ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు ప్రముఖ తారలు.‘‘పర్యావరణం రోజు రోజుకు మరింత నాశనం అవుతోంది. ఈ సందర్భంగా పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికి  ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు.

హీరో అల్లు అర్జున్‌ తన ఇంటి వద్ద మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్‌ చేసి, ‘‘భూమిని రక్షించుకునేందుకు మనందరం మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని కలుషితం చేయని అలవాట్లను అలవరుచుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనంగా మార్చుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అన్నారు.

‘‘మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. అలాంటి భూమిని నాశనం చేయడం ఆపేసి బాగు చేయడానికి సమయం కేటాయిద్దాం.. మనందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం’’ అని పోస్ట్‌ చేశారు సాయి తేజ్‌.

‘‘ప్రకృతి చేతుల్లోనే మనందరి ఆనందం, శాంతి దాగి ఉన్నాయి. అందుకే ప్రకృతిని సంరక్షించుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా మాట్లాడుకుంటాం. అయితే ఆ ఒక్కరోజే కాదు.. ప్రకృతి పట్ల ప్రతిరోజూ మనందరం బాధ్యతగా ఉందాం’’ అన్నారు రాశీ ఖన్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు