అదే ఇప్పుడున్న ట్రెండ్‌: అల్లు అర్జున్‌

19 Sep, 2022 04:12 IST|Sakshi
ప్రదీప్‌ వర్మ, కయదు లోహర్, శ్రీవిష్ణు, అల్లు అర్జున్, బెక్కెం వేణుగోపాల్‌

‘‘చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది కాదు. ఇప్పుడున్న ట్రెండ్‌ ఒక్కటే.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్‌ బాగుంటే థియేటర్స్‌కు వస్తున్నారు. ‘అల్లూరి’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లూరి’. కయదు లోహర్‌ కథానాయికగా నటించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ ‘నారాయనుడయ్యేను నవ వరుడు..’ అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమాలో తన నటన నచ్చడంతో  పిలిచి మాట్లాడాను. ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేసే శ్రీవిష్ణు అంటే నాకు ఇష్టం.. గౌరవం కూడా. యాక్టర్‌గా తను ఇంకా పైకి ఎదగాలి’’ అన్నారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమా తర్వాత బన్నీగారు నన్ను పిలిచి, ‘భవిష్యత్‌లో కంటెంట్‌ ఉన్న సినిమాలే ఆడతాయి. సో... కంటెంట్‌ ఉన్న చిత్రాల్లో నటించు.. లేకపోతే ఖాళీగా ఉండు’ అంటూ ఓ ముందు చూపుతో చెప్పారు. అవసరమైతే నా సినిమాని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో నేను ఓ చిన్న రోల్‌ చేశాను. ఆ తర్వాత నేను కేరళ వెళ్లినప్పుడు బన్నీగారి ఫ్యాన్స్‌ నన్ను గుర్తుపట్టి మాట్లాడారు.

బన్నీగారు టాలీవుడ్‌లో చేస్తే చాలు అది ప్యాన్‌ ఇండియా సినిమా అయిపోతుంది. ‘అల్లూరి’ చిత్రం పోలీస్‌ స్టోరీ. మా మూవీ చూసిన తర్వాత పోలీసు కనిపిస్తే సెల్యూట్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘పోలీసు అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీస్‌ అంటే ఒక వ్యవస్థ’ అనే డైలాగ్‌ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు ప్రదీప్‌ వర్మ. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్‌. ఈ కార్యక్రమంలో బెక్కెం బబిత, సహ నిర్మాతలు నాగార్జున, గంజి రమ్య, విజయలక్ష్షి్మ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్‌ రాజ్‌ తోట, దర్శకులు ప్రశాంత్‌ వర్మ, హర్ష, తేజ మార్ని, నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు