Am Aha Review: అం అః  మూవీ రివ్యూ

16 Sep, 2022 22:43 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : అం అః 
నటీనటులు : సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు
నిర్మాణ సంస్థలు: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ 
నిర్మాత:జోరిగె శ్రీనివాస్ రావు
దర్శకత్వం:శ్యామ్ మండ‌ల‌
సంగీతం : సందీప్ కుమార్ కంగుల‌
సినిమాటోగ్రఫీ:శివా రెడ్డి సావ‌నం 
ఎడిటర్‌:జె.పి
విడుదల తేది: సెప్టెంబర్‌ 16,2022

ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'అం అః'. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రాన్ని రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్‌ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
కల్యాణ్‌ (సుధాకర్‌ జంగం), బల్లు(రాజా),అరవింద్‌(ఈశ్వర్‌) ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు. చిలిపి పనులు చేస్తూ సరదాగా గడిపే ఈ బ్యాచ్‌ అనుకోకుండా నగరంలో పేరు మోసిన డాన్‌ జీఆర్(రామ‌రాజు) కుమారుడు గౌర‌వ్ మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి బయట పడేసేందుకు రూ.20 లక్షలు డిమాండ్‌ చేస్తాడు సీఐ ఫణీంద్ర(రవి ప్రకాశ్‌). ఆ డబ్బు కోసం కావ్య(సిరి)అనే అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌ చేస్తారు.మరి అంత డబ్బును కావ్య తల్లిదండ్రులు ఇచ్చారా? మర్డర్‌ కేసు నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? అసలు హత్య చేసిందెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అం అః’ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
క్రైం థ్రిల్ల‌ర్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఆడియన్స్‌ని ఎంగేజ్‌ చేసే కథలను ఎంచుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అందుకే కొత్త దర్శకులు ఎక్కువగా సస్పెన్స్‌ క్రైమ్‌ కథలను ఎ​​ంచుకు​ంటారు. ద‌ర్శ‌కుడు శ్యాం కూడా త‌న డెబ్యూ ఫిలింని ఓ ఇంట్రెస్టింగ్  క్రైమ్‌ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు.సస్పెన్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాధార‌ణ స్టూడెంట్స్ చుట్టూ మ‌లుపుల‌తో కూడిన స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించాడు. ఓ వైపు రెండు గ్యాంగ్ స్టార్స్ మ‌ధ్య వార్ ను చూపిస్తూనే…మ‌ధ్య‌లో ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ క్రైంలో ఇన్వాల్వ్ అయిన తీరు, కిడ్నాప్‌ డ్రామాను ఆసక్తికరంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో పేరు మోసిన నటీనటులు ఉంటే ఫలితం వేరేలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన ముగ్గురు కొత్త కుర్రాల్లే.అయినప్పటికీ చక్కగా నటించారు. ఎస్పీ పాత్రలో నటించిన రాజేశ్వరీ నాయర్‌ క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది.విల‌న్ పాత్ర‌ల్లో రామ‌రాజు, శుభోద‌యం సుబ్బారావు ఆక‌ట్టుకుంటారు. సీఐ పాత్ర‌లో క‌నిపించే ర‌విప్ర‌కాశ్ పాత్ర కూడా స‌స్పెన్స్ కొనసాగుతుంది.కావ్య పాత్రకి సిరి న్యాయం చేసింది. హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతో పర్వాలేదనిపించింది.

మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే..సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం పర్వాలేదు.ఇలాంటి క‌థ‌ల‌కు నేప‌థ్య సంగీతం చాలా ముఖ్యం. అది కొంత మిస్ అయిందనే చెప్పొచ్చు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్వాలేదు. ఎడిటర్‌ జె.పి పని తీరు బాగుంది. ట్విస్టుల‌తో కూడిన ఈ క‌థ‌ను చివ‌రిదాకా స‌స్పెన్స్ కొన‌సాగించేలా  ఎడిటింగ్‌ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు