Amigos Telugu Movie Review: ‘అమిగోస్‌’మూవీ రివ్యూ

10 Feb, 2023 10:39 IST|Sakshi
Rating:  

టైటిల్‌: అమిగోస్‌
నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, ఆషికా రంగనాథ్‌, బ్రహ్మాజీ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌
దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
ఎడిటర్‌: తమ్మిరాజు
విడుదల తేది: ఫిబ్రవరి 10, 2023

బింబిసార చిత్రంతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు కల్యాణ్‌ రామ్‌. గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్‌’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘అమిగోస్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

Amigos Telugu Movie Review

‘అమిగోస్‌’ కథేంటంటే..
సిద్ధార్థ్‌(కల్యాణ్‌ రామ్‌).. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్‌)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్‌సైట్‌ ద్వారా తనలాంటి పోలికలు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మంజునాథ్‌(కల్యాణ్‌ రామ్‌) అయితే.. మరోకరు  బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్(కల్యాణ్‌ రామ్‌).  ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్‌ అవుతారు. వీరు కలవడం కంటే ముందే బిపిన్‌ రాయ్‌ హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్‌ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థ్‌కి మైఖేల్‌గా పరిచయం చేసుకుంటాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్దార్థ్‌ని అరెస్ట్‌ చేయించడమే అతని ప్లాన్‌. మరి అది వర్కౌట్‌ అయిందా? ఎన్‌ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్‌ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? బిపిన్‌ రాయ్‌ వేసిన అసలు ప్లాన్‌ ఏంటి? అనేదే మిగతా కథ. 

Amigos Movie Rating And Highlights

ఎలా ఉందంటే.. 
బింబిసార లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం కావడం.. పైగా కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ‘అమిగోస్‌’పై ముందు నుంచే భారీ అంచనాలు పెరిగాయి. టైటిల్‌ మాదిరే ఈ కాన్సెప్ట్‌ కూడా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ కథనం ఆకట్టుకునేలా సాగలేదు.  ఈ చిత్రంలో ఒకే రూపంతో ముగ్గురు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు విలన్‌ అని, తన అవసరం కోసం మిగతా ఇద్దరిని వాడుకుంటాడని ట్రైలర్‌లోనే చూపించారు. విలన్‌ కోసం ఎన్‌ఏఐ అధికారులు వెతకడం కూడా అందులో చూపించారు. అయితే ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లు ఎలా కలిశారనేదే మిగతా కథ. ఆ కథను ఆసక్తికరంగా నడిపించే విషయంలో దర్శకుడు నిరాశపరిచాడు. కథనాన్ని చాలా చప్పగా..రొటీన్‌గా నడిపించాడు.

సినిమా మొత్తంలో క్యూరియాసిటీ పెంచే సీన్స్‌ ఒక్కటంటే ఒక్కటి ఉండదు. పైగా రొటీన్‌ లవ్‌స్టోరీ ప్రేక్షకులను విసిగిస్తుంది. పస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.  ఎలాంటి ట్విస్టులు, వావ్‌ మూమెంట్స్‌ లేకుండా చాలా రొటీన్‌గా ఫస్టాఫ్‌ సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ కూడా కొన్ని సాగదీత సీన్స్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్‌నే ఎంచుకున్నాడు కానీ.. అంతే కొత్తగా, ఆసక్తికరంగా తెరపై చూపించడంలో ఫెయిల్‌ అయ్యాడు. 

Amigos Movie HD Stills

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించాడు.  సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా,  మైఖేల్‌ అనే గ్యాంగ్ స్టర్‌గా.. ఇలా మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్ చేసిన కల్యాణ్‌ రామ్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. రెండు, మూడు నిమిషాలు మినహా తెరపై మొత్తం కల్యాణ్‌ రామే కనిపిస్తాడు. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న మైఖేల్‌ పాత్రలో కల్యాణ్‌ నటన చాలా బాగుంటుంది. 

ఇక హీరోయిన్‌ రిషిక పాత్ర నిడివి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించిది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’ పాట రీమేక్‌ బాగా సెట్‌ అయింది. ఎస్‌. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు