అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..

29 Nov, 2020 08:36 IST|Sakshi

 మొహబ్బతే 

నీతూ సింగ్, రిషీ కపూర్‌ పెళ్లిలో రేఖ కట్టుబొట్టు, నడత తీరు జయా బచ్చన్‌ను చాలానే ఇబ్బంది పెట్టింది. తమ వైవాహిక అనుబంధం గురించి రేఖకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంది జయా. ఆ సమయం కోసం వేచి చూస్తోంది. ‘సిల్‌సిలా’ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవడానికి ముందు.. రేఖను భోజానానికి పిలిచింది జయా. భోజనాలయ్యాక.. హాయిగా కబుర్లు చెప్పుకున్నారిద్దరూ. బొట్టుపెట్టి రేఖను సాగనంపేటప్పుడు చెప్పింది జయా ‘ఏది ఏమైనా అమిత్‌ను వదిలిపెట్టే సమస్యే లేదు’ అని చిరునవ్వు చెదరనివ్వకుండానే స్థిరంగా. ఆ విందు ఆంతర్యం అర్థమైంది రేఖకు. ‘సిల్‌సిలా’ తర్వాత రేఖ, అమితాబ్‌ బచ్చన్‌ల మధ్య స్నేహం తగ్గసాగింది. కారణం రేఖతో జయ చెప్పిన మాటే కావచ్చు. అయినా అమితాబ్‌ బచ్చన్‌.. రేఖ హీరోయిన్‌గా ఉన్న సినిమాలు సైన్‌ చేశాడు. అందులో ‘ముకద్దర్‌ కా సికందర్‌’ ఒకటి. 

ఇది నిజమేనా?
‘ముకద్దర్‌ కా సికందర్‌’లో రేఖది చిన్న పాత్రే. అందులో కథానాయిక రాఖీ. సినిమా పూర్తయింది. ‘‘ట్రయల్‌ షో చూడ్డానికి అమిత్‌జీతోపాటు అతని పేరెంట్స్, జయాజీ కూడా వచ్చారు. ఆమె ఒక్కరే ముందు వరుసలో కూర్చున్నారు. జయాజీ వెనకాల లైన్‌లో అమిత్‌జీ, అతని పేరెంట్స్‌ కూర్చున్నారు. ఆ ముగ్గురికీ జయాజీ ఫీలింగ్స్‌ కనపడట్లేదు కాని ప్రొజెక్షన్‌ రూమ్‌లో ఉన్న నాకు క్లియర్‌గా కనపడ్తున్నాయి. ఆ సినిమాలో మా ఇద్దరి లవ్‌ సీన్స్‌ వచ్చినప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం, వాటిని దాచుకోవడానికన్నట్టు ఆమె తలవంచుకోవడం.. నాకు స్పష్టంగా కనపడింది. ఇది జరిగిన వారానికి ఇండస్ట్రీలోని అందరూ నాతో చెప్పసాగారు ‘ఇకమీదట అమిత్‌జీ మీతో కలిసి నటించరట. ప్రొడ్యూసర్స్‌కి ఇన్‌ఫార్మ్‌ చేసేశారు’ అంటూ. కాని ఆ నిర్ణయం తీసుకున్న అతను మాత్రం నాతో ఒక్కమాటా అనలేదు. అందుకే నేరుగా అమిత్‌జేనే అడిగా ఇది నిజమేనా? అని. ‘దాని గురించి నన్నేం అడగొద్దు.. నేనేం చెప్పలేను’ అని దాటవేశారు’’ అని చెప్పారు రేఖ ఒక ఇంటర్వ్యూలో.  అమితాబ్‌ ఆ నిర్ణయం వెనుక జయా హెచ్చరికలే కారణం అని చెప్తారు ఆ ముగ్గురి సన్నిహితులు. ‘ముకద్దర్‌ కా సికందర్‌’ సినిమా ట్రయల్‌ షో తర్వాత జయా బచ్చన్‌.. అమితాబ్‌ బచ్చన్‌ను హెచ్చరించింది అని.. అందుకే రేఖతో కలిసి నటించేదిలేదనే నిశ్చయానికి వచ్చాడని ఆ సన్నిహితుల అభిప్రాయసారం. 

తిరిగి ఇచ్చేసింది..
అమితాబ్‌ బచ్చన్, రేఖకు మధ్య ఎడబాటు మొదలైన సమయంలో రేఖ ‘ఖూబ్‌సూరత్‌’ సినిమా షూటింగ్‌లో ఉంది. అమితాబ్‌ మీది నుంచి మనసు మళ్లించాలనే తాపత్రయంతో పనిచేస్తోందే కాని తనవల్ల కావడంలేదు. దానికి తోడు తన వేళ్లకున్న ఆ రెండు ఉంగరాలు అతణ్ణి మరచిపోనివ్వడంలేదు. అవి అమితాబ్‌  సన్నిహితంగా ఉన్న రోజుల్లో ఆమెకు కానుకగా ఇచ్చిన ఉంగరాలు. వాటిని చూస్తూ అతని తలపుల్లో మరింత కూరుకుపోవడమే తప్ప బయటపడలేను అనుకుంది. అయినా అతని ప్రేమే దూరమైప్పుడు ఆ ఆనవాళ్లు మాత్రం ఎందుకు? అనీ మనసు దిటవుచేసుకుంది. అందుకే వెంటనే ఆ రెండు ఉంగరాలనూ తిరిగి అమితాబ్‌ బచ్చన్‌కు పంపించేసింది. ‘‘వాటిని అమిత్‌జీ నా వేళ్లకు పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా తీయలేదు నేను. నిద్రపోయేప్పుడు కూడా ఉండేవి. అతను నన్ను కాదనుకున్నాక అతను ఇచ్చిన కానుకలను నేనెందుకు కావాలనుకోవాలి.. అందుకే తిరిగి ఇచ్చేశా. అందుకే ‘ఖూబ్‌సూరత్‌’ సినిమాలో ఇంటర్వెల్‌ తర్వాత నా వేళ్లకు ఉంగరాలు కనపడవు’’ అని చెప్పింది రేఖ. 

అక్కడితో ఆ ఇద్దరి ప్రేమకే కాదు, స్నేహానికీ ది ఎండ్‌ పడింది. ఇంత జరిగినా అమితాబ్‌ బచ్చన్‌ నోటివెంట ఒక్క పలుకూ లేదు రేఖ గురించి కాని, రేఖ మీదున్న తన ప్రేమ గురించి కానీ. ఇప్పటికీ అదే మౌనం. అయితే ఆ ఇద్దరి  గురించి మీడియా జయా బచ్చన్‌ అడిగింది. ‘‘అమితాబ్‌ పేరు అతనితో కలిసి నటించిన చాలా మంది హీరోయిన్లతో లింక్‌ అయింది. అవన్నీ నిజమైతే నా జీవితం నరకమయ్యేది. నేను హ్యాపీగానే ఉన్నాను. అంటే అవన్నీ రూమర్స్‌ అనే కదా’’ అంటూ ఆ ప్రేమను కొట్టిపారేసింది ఆమె. 

రేఖ ది అన్‌టోల్డ్‌ స్టోరీ
‘‘యెస్‌.. అమిత్‌జీతో ప్రేమలో పడ్డాను. ఈ లోకంలోకెల్ల అతణ్ణి మించిన ఇష్టం లేదు. నా జీవితంలోని అద్భుతాల్లో అమిత్‌జీ ఒకరు. అతను నాకో టీచర్‌.. గురువు. అతణ్ణించి కెమెరా ముందు నేర్చుకునేవెన్నుంటాయో.. కెమెరా వెనక నేర్చుకునేవీ అన్ని ఉంటాయి’’ అంటుంది రేఖ తన బయోగ్రఫీ లో. తమ వ్యవహారాన్ని అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పుడూ బయటపెట్టకపోవడం పట్ల రేఖ స్పందిస్తూ  ‘‘తన ఇమేజ్, తన కుటుంబం, తన పిల్లలను కాపాడుకోవడానికి బయటపెట్టలేదు. అయినా బయటపెట్టాల్సిన అవసరం ఏంటి? నేను అతణ్ణి ప్రేమిస్తున్నాను.. అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే. ఒకవేళ నా దగ్గర కూడా తన ప్రేమను బయటపెట్టకపోయుంటే అప్పుడు కచ్చితంగా బాధపడేదాన్ని’’ అని చెప్పింది రేఖ ఒక ఇంటర్వ్యూలో. ఇదే విషయం మీద ఇంకో చోట ‘‘మిస్టర్‌ బచ్చన్‌.. పాత తరం మనిషి. ఎవరినీ బాధపెట్టాలనుకోడు. తన ప్రేమ వ్యవహారం బయటపెట్టి భార్యనెలా బాధపెడ్తాడు?’’ అని కూడా స్పందించింది రేఖ.
-ఎస్సార్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా