సెల్ఫ్‌ మేడ్‌ 

18 Feb, 2024 00:31 IST|Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై అమితాబ్‌ బచ్చన్‌ ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాలీవుడ్‌ బిగ్‌ బి నటుడిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 55 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఏఐతో చేసిన తన ఫొటోలను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. ‘‘సినిమా అనే అద్భుత ప్రపంచంలో 55 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ‘సెల్ఫ్‌ మేడ్‌’’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌ ఈ ఫొటోలను ఉద్దేశించి పేర్కొన్నారు. నిజంగానే అమితాబ్‌ ‘సెల్ఫ్‌ మేడ్‌’. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్నో కష్టాలు పడి అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ యాక్టర్‌గా ఎదిగారు.

కెరీర్‌ తొలి నాళ్లలో ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు కూడా. తిరస్కరణలకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్నాళ్లు ముంబై మెరీనా బీచ్‌లో గడిపారు. ఎన్నో సవాళ్లను దాటుకుని 1969లో అమితాబ్‌ ‘సాత్‌ హిందూస్థానీ’ చిత్రంతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే న్యూ కమర్‌గా నేషనల్‌ అవార్డు అందుకున్నారు అమితాబ్‌. అదే ఏడాది ఉత్పల్‌ దత్‌ హీరోగా చేసిన ‘భువన్‌ షోమ్‌’ సినిమాకు నరేటర్‌గా చేశారు అమితాబ్‌.

ఆ తర్వాతే మధు, ఉత్పల్‌లతో కలిసి అదే ఏడాది ‘సాత్‌ హిందూస్థానీ’ సినిమాతో అమితాబ్‌ ఎంట్రీ జరిగింది. అలా ముందు తన గొంతు వినిపించి, ఆ తర్వాత నటుడిగా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించారు. ‘భువన్‌ షోమ్‌’ చిత్రం మేలో విడుదల కాగా, ‘సాత్‌ హిందూస్థానీ’ చిత్రం నవంబరులో విడుదలైంది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’తో పాటు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్‌ బచ్చన్‌.

whatsapp channel

మరిన్ని వార్తలు