‘నిన్ను తన్నమని ఒక్క మాట చెప్తే చాలు’

28 Jul, 2020 19:05 IST|Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు అమితాబ్‌. ఈ క్రమంలో మంగళవారం బిగ్‌ బీ.. వివరాలు తెలియని ఓ వ్యక్తిని ఉద్దేశిస్తూ.. బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో సదరు వ్యక్తిని బిగ్‌ బీ తీవ్రంగా మందలించారు. విషయం ఏంటంటే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ను ఉద్దేశిస్తూ.. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ‘అమితాబ్‌ బచ్చన్‌ మీరు కరోనాతో మరణిస్తారని నమ్ముతున్నాను’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై అమితాబ్‌ తీవ్రంగా స్పందించారు. సదరు వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు బిగ్‌ బీ. (అభిషేక్‌.. గ‌ట్టి హ‌గ్ ఇవ్వాల‌నుంది)

‘వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి.. కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. ఎందుకంటే ఆ విషయం గురించి నీకు తెలియదు కనుక. రెండు విషయాలు మాత్రమే జరగడానికి అవకాశం ఉంది. ఒకటి నేను మరణించడం... లేదా జీవించడం. నేను మరణించాననుకో ఇక మీదట ఏ సెలబ్రిటీని ఉద్దేశించి నీవు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేవు. అమితాబ్‌ బచ్చన్‌ గురించి నువ్వు రాశావు కనుకే నీ పనికిమాలిన రాతలను గుర్తించారు. దేవుడి దయ వల్ల నేను కోలుకున్నాననుకో నీవు పెద్ద తుపానును ఎదుర్కొవాల్సి వస్తుంది. దాదాపు 90 మిలియన్ల మంది నీపై దాడి చేస్తారు. నేను దీని గురించి ఇంకా వారికి చెప్పలేదు. వారి ఆగ్రహం మొత్తం ప్రపంచాన్ని దాటుతుంది. పశ్చిమం నుంచి తూర్పుకు.. ఉత్తరం నుంచి దక్షిణానికి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నిన్ను తన్నమని ఒక్క మాట వారికి చెప్తే.. ప్రపంచం అంతా విస్తరించిన ఈ కుటుంబం.. ఓ నిర్మూలన కుటుంబంగా మారుతుంది జాగ్రత్త’ అంటూ బిగ్‌ బీ తన లేఖలో హెచ్చరించారు. (నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు: అమితాబ్‌)

అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు, కోడలు, మనవరాలికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఐశ్వర్య, ఆరాధ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. బిగ్‌ బీ, అభిషేక్‌ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు