Amrita Rao: దారుణంగా మోసం చేశాడు, నా గుండె ముక్కలైంది: అతిధి హీరోయిన్‌

27 Mar, 2023 20:28 IST|Sakshi

అమృతరావు.. తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. అదీ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో.. అతిథి సినిమాలో మహేశ్‌తో జోడీ కట్టిందీ హీరోయిన్‌. దానికి ముందు, తర్వాత హిందీ సినిమాలే చేస్తూ బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది. అమృత తన జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. అందులో తన మేనేజర్‌ చేసిన మోసాన్ని ప్రస్తావించింది. "అప్పుడు నేను మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నాను.

ఒకరోజు సాయంత్రం తాజ్‌ బంజారా హోటల్‌లో బోనీ కపూర్‌తో పనిచేసిన వ్యక్తిని చూశాను. అతడు నన్ను చూడగానే హాయ్‌ అమృతా అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నావు అంటూ బాగోగులు అడిగి, నీకు డేట్స్‌ సర్దుబాటు అయ్యుంటే మాతో పాటు సల్మాన్‌ ఖాన్‌ వాంటెడ్‌ షూటింగ్‌లో ఉండేదానివి అన్నాడు. ఆ మాటకు నేను బ్లాంక్‌ అయ్యాను. అసలు వాంటెడ్‌ కోసం నన్నెప్పుడు అడిగారని తిరిగి ప్రశ్నించాను. దానికతడు 'అలా అంటావేంటి? వాంటెడ్‌ కోసం నిన్నే సంప్రదించాం. నీ మేనేజర్‌కు ఫోన్‌ చేశాం. కానీ ఆయన నీ డేట్స్‌ సర్దుబాటు చేయడం కష్టమని చెప్పాడు' అని తెలిపాడు. ఆ మాట విని నా గుండె ముక్కలైంది. 

అంత పెద్ద ఆఫర్‌ వచ్చిందన్న విషయం మేనేజర్‌ నాకు చెప్పనేలేదు. నన్ను మోసం చేశాడు. అంత మంచి ఆఫర్‌ నాదాకా వస్తే నేనెందుకు మిస్‌ చేసుకుంటాను. కచ్చితంగా డేట్స్‌ ఇచ్చేదాన్ని. పొమ్మనలేక పొగ బెట్టినట్లు.. తను స్వతాహాగా నా దగ్గర ఉద్యోగం మానేయడానికి బదులు నేనే అతడిని వెళ్లగొట్టేలా చేశాడు. కానీ ఇలా వాంటెడ్‌ ఛాన్స్‌ మిస్‌ చేసి.. మర్చిపోలేని బాధను గిఫ్ట్‌ ఇచ్చాడు" అని రాసుకొచ్చింది అమృత. 2006లో వచ్చిన పోకిరి సినిమాకు రీమేక్‌గా వాంటెడ్‌ తెరకెక్కింది. ప్రభుదేవా డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, ఆయేషా టకియా, వినోద్‌ ఖన్నా, ప్రకాశ్‌ రాజ్‌, ఇందర్‌ కుమార్‌, మహేశ్‌ మంజ్రేకర్‌ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సెన్సేషన్‌ సృష్టించింది. 2009లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మరిన్ని వార్తలు