నాటకాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి

1 Nov, 2020 22:49 IST|Sakshi

గ్లామర్‌ కన్నా యాక్టింగ్‌ గ్రామర్‌తో గుర్తింపు పొందడాన్ని మించిన కితాబు లేదు. అలాంటి అవార్డ్‌ కోసమే తాపత్రయపడుతుంటారు చాలామంది నటీనటులు. అలా  ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసిన నటి అమృతా సుభాష్‌. మరాఠీ, హిందీ సినిమా, వెబ్‌ సిరీస్‌ నటే కాదు, గాయని కూడా. 

  • ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి సుభాష్‌చంద్ర ధేంబ్రే. తల్లి జ్యోతి సుభాష్‌... సుప్రసిద్ధ మరాఠీ నటి. ప్రఖ్యాత నాటక రచయిత గోవింద్‌ పురుషోత్తమ్‌ దేశ్‌పాండే అమృత మేనమామ. ఆమెకు ఒక సోదరుడు. పేరు.. జయ్‌. 
  • పుణెలోని ఎస్‌పీ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. ఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో నటనలో శిక్షణ తీసుకుంది. 
  • మరాఠీ, హిందీ నాటకాల్లోని అమృత అభినయ కళే ఆమెను సినిమాలకు పరిచయం చేసింది. 2004లో ‘శ్వాస్‌’తో మరాఠీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. అది ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడంతోపాటు ఆస్కార్‌ నామినేషన్స్‌కీ వెళ్లింది మన దేశపు అఫీషియల్‌ ఎంట్రీగా. 2009లో వాళ్లమ్మ జ్యోతి సుభాష్‌తో కలిసి ‘గంధా’ అనే సినిమాలోనూ నటించింది. 
  • బాలీవుడ్‌లోనూ ఆమె నటనా సంతకం ఉంది. ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’, ‘గల్లీ బాయ్‌’ వంటి సినిమాలు ఆమె ప్రతిభను దేశమంతటికీ చూపించాయి. నిండా నలభై ఏళ్లు లేని అమృతా ‘గల్లీ బాయ్‌’లో రణ్‌వీర్‌ సింగ్‌కు తల్లిగా నటించి మెప్పించింది. 
  • శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం నేర్చుకుంది. ఉత్తమ గాయనిగా మహారాష్ట్ర ప్రభుత్వపు పురస్కారాన్నీ పొందింది. 
  • ‘జోకా’, ‘పాల్‌ఖుణ’, ‘అవఘాఛి’ వంటి మరాఠీ టీవీ షోల్లో నటించింది. ‘కట్టి బట్టి’ అనే సీరియల్‌కు సంగీతం సమకూర్చింది. 
  • ‘సెలెక్షన్‌ డే’, ‘సేక్రెడ్‌ గేమ్స్‌ సీజన్‌ 2’.. సిరీస్‌తో ఓటీటీలోనూ మోస్ట్‌ టాలెంటెడ్‌గా మన్ననలందుకుంది. 
  • అమృత సుభాష్‌  సామాజిక కార్యకర్త, రచయిత కూడా. 2014లో ‘ఎక్‌ ఉలట్‌ ఎక్‌ సులట్‌’ అనే పుస్తకం రాసింది. 
  • ‘సినిమాలు, సిరీస్‌ కంటే కూడా థియేటర్‌ మీదే నాకు ప్రేమ.  నాటకాలు నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయి’ అంటుంది అమృతా సుభాష్‌.  
మరిన్ని వార్తలు