థాంక్‌ యూ బ్రదర్‌: ఆ డేట్‌ నుంచి ఆహాలో ప్రసారం..

26 Apr, 2021 15:33 IST|Sakshi

కరోనా కారణంగా గతేడాదే సినీ పరిశ్రమకు భారీగా దెబ్బ పడింది. సుమారు ఏడునెలల పాటు థియేటర్లు తెరుచుకునోలేదు. దీని ప్రభావం చాలాచోట్ల ప్రస్ఫుటంగా కనిపించింది. కానీ టాలీవుడ్‌ మాత్రం త్వరగానే కోలుకుంది. పలు సినిమాలు క్రాకింగ్‌ హిట్లు అందుకున్నాయి. ఉప్పెనలా జనం తరలిరావడంతో మంచిరోజులకు నాంది పడింది అనుకున్నారంతా.. కానీ అంతలోనే పరిస్థితులు మళ్లీ తలకిందులు అయ్యాయి.

ఈసారి కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభిస్తుండటంతో థియేటర్లు మూసేయక తప్పలేదు. దీంతో ఈ నెలలో రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్‌ స్టోరీ', దగ్గుబాటి రానా 'విరాటపర్వం' వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'థ్యాంక్‌ యు బ్రదర్'‌ కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ను రద్దు చేసుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న ఆహాలో రిలీజ్‌ చేస్తున్నారు.

బహుశా ఈ డీల్‌ ఇంతకు ముందే జరిగి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్‌లో రిలీజైన వారానికే ఓటీటీలో వదిలేందుకు ముందే డీల్‌ కుదుర్చుకున్నారననేది వాళ్ల అంచనా. మొత్తానికి ఈ సినిమా ఆహాలో వచ్చే నెల 7 నుంచి ప్రసారం కాబోతోంది. అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్‌ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనసూయ గర్భిణిగా నటిస్తోంది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చదవండి: లిఫ్ట్‌లో అనసూయకు పురిటి నొప్పులు

>
మరిన్ని వార్తలు