TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్‌ఆర్‌

11 May, 2021 15:50 IST|Sakshi

ప్రముఖ జర్నలిస్టు, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ప్రార్థించారు. ఇక కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డ టీఎన్‌ఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(మే10)న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌' అనే షోతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టీఎన్‌ఆర్‌ ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌ వేదికగా  రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ సహా ఎంతోమంది సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఒక్కోసారి 4 గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే.


1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న టీఎన్‌ఆర్‌ ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్‌’ చిత్రానికి సైతం స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత నటుడిగానూ తన ప్రస్థానం సాగించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాల్లో నటించారు.

అయితే దర్శకుడిగా ఇండస్ర్టీలో తనదైన మార్క్‌ చూపించాలని టీఎన్‌ఆర్ కలలు కన్నారు. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలన్న కల తీరకుండానే తుదిశ్వాస విడాచారు. మానవ విలువలతో కూడిన మంచి కథతో ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టీఎన్‌ఆర్ అంటుండేవారని, అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. 

చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌
టీఎన్‌ఆర్‌ లాస్ట్‌ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు