ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి

17 Aug, 2021 14:04 IST|Sakshi

తనదైన యాంకరింగ్‌తో తెరపై అలరిస్తూ బుల్లితెర రాముల్మగా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. ఓ డ్యాన్స్‌ షోతో యాంకర్‌గా కేరీర్‌ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు చెల్లెలు పాత్రలు చేసింది. ఈ క్రమంలో పలు మూవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె ఫుల్‌టైం యాంకర్‌గా మారిపోయింది. అలా పటాస్‌ వంటి టీవీ షోలకు యాంకరింగ్‌ చేస్తూ టాప్‌ యాంకర్లలో ఒకరిగా ఎదిగింది. తరచూ ఫొటోషూట్‌లను, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ‍శ్రీముఖి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో శ్రీముఖి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కేరీర్‌ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. ‘యాంకర్‌గా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. షూటింగ్ చేసే సమయంలో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. అంతసేపు నిలబడటం వల్ల నా కాళ్లు తిమ్మిర్లు వచ్చేవి.

కొన్నిసార్లు అయితే షూటింగ్ కోసం ఉద‌యం 7గంటలకు వెళితే మరుసటి రోజు ఉద‌యం 7గంటల‌కు ఇంటికి వచ్చేదాన్ని. అసలు ఖాళీ సమయమే దొరికేదు కాదు. దీంతో అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని కన్నీరు పెట్టుకున్నాను. మా నాన్న దగ్గర చెప్పుకుని బాధపడ్డాను. దీంతో ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సాహించారు. ఆయన ఇచ్చిన ప్రొత్సాహంతోనే వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు యాంకర్‌గా ఈ స్థాయికి చేరుకున్నాను’ అని చెప్పింది. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘జులాయి’ సినిమాతో నటిగా పరిచయమైన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న ఆమె ఆ త‌ర్వాత త‌న రేంజ్‌ని మ‌రింత పెంచుకుంది. 


మరిన్ని వార్తలు