సుమ తొలి యాంకరింగ్‌ ప్రోగ్రాం ఏంటో తెలుసా?

29 Mar, 2021 08:39 IST|Sakshi

సాక్షి, అరసవల్లి:  టీవీ ఉన్న ప్రతి ఇంటి వారూ ఆమెకు చుట్టాలే. బుల్లితెర వీక్షకులంతా బంధువులే. ఆమె తెలీని తెలుగిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరను రెండు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణిలా ఏలుతున్న సుమ ఇటీవల అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో  మాట కలిపారు.  

తెలుగు మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇదంతా ఎప్పుడు మొదలైంది? 
1991లో దూరదర్శన్‌ సీరియల్స్‌లో పలు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. 1995 తర్వాత జెమిని వంటి ప్రైవేటు చానల్స్‌లో అవకాశాలు పెరగడంతో బిజీ అయ్యాను. తెలుగు సీరియల్స్‌కు అప్పుడే క్రేజ్‌ పెరిగింది. 

మీరు మలయాళీ కదా. ఇంత అచ్చమైన తెలుగు ఎలా? 
నిజమే కానీ.. పట్టుదలతోనే తెలుగులో పట్టు సాధించాను. పుట్టింది పెరిగింది కేరళలో అయినప్పటికీ తెలుగు అనర్గళంగా  వచ్చేసింది. అప్పట్లో డబ్బింగ్‌కు ఇబ్బంది పడిన నేను ఇప్పుడు వందలాది సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్‌ చేస్తున్నాను. 

రాజీవ్‌ కనకాలతో పరిచయం ఎలా? 
1994లో ఓ సీరియల్‌ షూటింగ్‌లో నన్ను తొలిసారి రాజీవ్‌ చూశారు. ప్రపోజ్‌ కూడా చేసేశారు. అప్పటికే రాజీవ్‌ వాళ్ల నాన్నగారు దేవదాస్‌ కనకాలకు ఇండస్ట్రీలో పెద్ద పేరుంది. సీరియల్స్‌ తో పాటు సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే 1995 తర్వాత సీరియల్స్‌ పెరిగాయి. వాళ్ల సొంత ప్రొడక్షన్‌లో మేఘమాల అనే సీరియల్‌లో నటించాను. అప్పుడే రాజీవ్‌ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. 1999లో అందరి ఆమోదంతో పెళ్లి జరిగింది.  

సినిమాలో హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి కారణం? 
రాణించడం అని కాదు ఎందుకో కంఫర్ట్‌గా లేను. ఫ్రీడం కోల్పోయినట్లైంది. దాసరి నారా యణరావు గారి కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా నటించాను. అలాగే రెండు మలయాళ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించాను. కానీ ఎందుకో ఇష్టం లేక వదిలేశాను. తర్వాత సీరి యల్స్, సినిమాలో చిన్న పాత్రలు ఇప్పుడు అవి కూడా దాదాపుగా వదిలేశాను. పూర్తిగా యాంకరింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాను. 2006లో ‘అవాక్కయ్యారా...’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్‌ ప్రారంభించాను. 

పిల్లలను కూడా మీ ప్రపంచంలోకి దించేస్తున్నారా? 
నేనేం దింపనక్కర్లేదు. వాళ్లే దిగిపోతున్నారు. మనం ప్రోత్సహించడం వరకే(నవ్వుతూ..). పాప మనస్విని పేరుతో ప్రొడక్షన్‌ హౌస్, అలాగే జుజిబి టీవీ షోల నిర్వహణ, అలాగే బాబు రోషన్‌ కార్తీక్‌ హీరోగా డెబ్యూ అవుతున్నాడు. దీంతో మా ఫ్యామిలీ అంతా సినీ కళామతల్లికి సేవలోనే తరిస్తున్నామన్నమాట.   

అసలు ఇంత అద్భుతంగా యాంకరింగ్‌ చేయడం మీకెలా సాధ్యమవుతోంది? 
యాంకరింగ్‌కు ముందు సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాను. కానీ పెద్దగా కంఫర్ట్‌గా అనిపించలేదు. పైగా మా ఆయన రాజీవ్‌కు కూడా నేను సినిమాలు చేయడం పెద్దగా ఇష్టం లేదు (నవ్వుతూ).. అందుకే యాంకరింగ్‌ను నమ్ముకున్నాను. అయితే ఇంట్లో మా అమ్మకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. అదే ఇప్పుడు నాకు యాంకరింగ్‌ ప్రొఫెషన్‌కు ఉప యోగపడిందని భావిస్తాను. అందుకే నాకు మా అమ్మే గురువు.  

ఆదిత్యుని దర్శనంపై..?
నిజంగా అదృష్టం. ఎప్పటి నుంచో అ నుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు చేయడంపై ప్రధాన అర్చకులు శంకరశర్మ వివరించారు. అలాగే శ్రీకూ ర్మం కూడా దర్శించుకున్నాను. జిల్లాలో పురాతన ఆలయాలపై సహాయ కమిషనర్‌ సూ ర్యప్రకాష్‌ గారు వివరాలిచ్చారు. నిజంగా శ్రీకాకుళం సుందరమైన ప్రాంతం.
చదవండి: యాంకర్‌ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం

మరిన్ని వార్తలు