అందరూ బాగుండాలి...

17 Dec, 2020 05:50 IST|Sakshi

‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే మంచి కథ ఉన్న సినిమాలో అలీ, నరేశ్‌ నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నటుడు అలీ ‘అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలీ, సీనియర్‌ నరేశ్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొనతాల మోహనకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి కెమెరామేన్‌ ఎస్‌. గోపాల్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఈ చిత్రదర్శకుడు కిరణ్‌ చెన్నైలో రూమ్‌ మేట్స్‌. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్‌’’ అన్నారు అలీ. ‘‘అలీ ఓ చిత్రం చేస్తున్నాడంటే దానికి ఒక బ్రాండ్‌ వస్తుంది’’ అన్నారు నరేశ్‌. ‘‘బుధవారమే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం’’ అన్నారు శ్రీపురం కిరణ్‌. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్‌ పళిడమ్, కెమెరా: ఎస్‌. మురళీ మోహన్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు