‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ

28 Oct, 2022 09:08 IST|Sakshi

టైటిల్‌: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
నటీనటులు:  అలీ, నరేశ్‌, పవిత్రా లోకేశ్‌,  మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ తదితరులు
నిర్మాణ సంస్థ: అలీవుడ్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌,
 నిర్మాత  :  కొనతాల మోహన్‌  
దర్శకత్వం: శ్రీపురం కిరణ్‌
సంగీతం: రాకేశ్‌ పళిడమ్‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌. మురళి మోహన్‌రెడ్డి
ఎడిటర్‌: సెల్వకుమార్‌
విడుదల తేది: అక్టోబర్‌ 28, 2022(ఆహా)

కమెడియన్‌ అలీ, సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్‌ హిట్‌ ‘వికృతి’కి తెలుగు రీమేక్‌ ఇది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్‌ 28) ప్రముఖ ఓటీటీ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
శ్రీనివాసరావు(నరేశ్‌), పవిత్ర లోకేశ్‌(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్‌(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్‌కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్‌కి సెల్ఫీలు, సోషల్‌ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్‌ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్‌ పెట్టిన ఓ పోస్ట్‌ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్‌ సోషల్‌ మీడియా పెట్టిన పోస్ట్‌ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్‌ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
మలయాళ సూపర్‌ హిట్‌  ‘వికృతి’కి తెలుగు రీమేకే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు  శ్రీపురం కిరణ్‌. సోషల్‌ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో, దాని వల్ల కొందరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో తెరపై చక్కగా చూపించాడు.  సినిమా అంతా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్‌, పవిత్రా లోకేష్‌ మధ్య వచ్చే ప్రతి సీన్‌ ప్రేక్షకుడి హృదయాలను హత్తుకుంటాయి. ఇది ఎమోషనల్‌గా సాగే కథ అయినప్పటికీ.. హాస్యానికి కూడా కొదవ ఉండదు. హీరో లవ్‌ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ చాలా నెమ్మదిగా సాగడం సినిమా స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకి థియేటర్స్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ.. ఓటీటీకి మాత్రం పక్కా సెట్‌ అయ్యే మూవీ. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది.

ఎవరెలా చేశారంటే.. 
అలీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఎంత నవ్వించగలడో..అంత ఏడిపించగలడు. ఈ సినిమాలో సమీర్‌ పాత్రకు న్యాయం చేశాడు. సోషల్‌ మీడియా, సెల్ఫీల పిచ్చి ఉండే పాత్ర తనది. ఇక సినిమాకు ప్రధాన బలం నరేశ్‌, పవిత్రా లోకేశ్‌. కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. తెరపై నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ల ఎమోషనల్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. మూగ వ్యక్తిగా నరేశ్‌ నటన అద్భుతంగా ఉంది. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే  సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది.మనో, తనికెళ్ల భరని, మౌర్యానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతిక విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫర్‌  మురళి మోహన్‌రెడ్డి , ఎడిటర్‌ సెల్వకుమార్‌ పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సినిమాతో అలీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాడని చెప్పొచ్చు. 
 

మరిన్ని వార్తలు