జాతీయగీతం కాపీ కొట్టావంటూ అను మాలిక్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

2 Aug, 2021 10:09 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో కాపీల వివాదాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. స్టోరీ, పోస్టర్లు, మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా చాలా విషయాల్లో ఇతర సినిమా నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు అనేక సందర్భంలో రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్‌ విషయంలో కాపీల వివాదాలు కోకొల్లలుగా పుడుతున్నాయి. తెలుగు నుంచి బాలీవుడ్‌, హాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుమాలిక్‌ సినిమాలోని పాటపై వివాదం చుట్టుముట్టింది. అనుమాలిక్‌ సంగీతం అందించిన దిల్జాలే సినిమా బాలీవుడ్‌లో 1996లో విడుదలైంది. ఇందులో ‘మేరా ముల్క్‌ మేరా దేశ్‌’ అనే పాట ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ..

టోక్యో ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌ జిమ్నాస్ట్‌ అర్టెమ్‌ డోల్గోప్యాట్‌ రెండోసారి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న తర్వత వారి జాతీయ గీతం హత్వికాను ప్లే చేశారు. ఇది విన్న భారత నెటిజన్లు అప్పటి నుంచి అనుమాలిక్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఇజ్రాయిల్‌ జాతీయ గీతం హతిక్వా,  అను ముల్క్‌ మేరా దేశ్‌ పాటకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్‌ జాతీయ గీతాన్ని దొంగిలించి తన చిత్రంలో ఉపయోగించుకున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది వరుస ట్వీట్లు చేస్తూ అను మాలిక్‌ పేరును ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిపారు. నెటిజన్లు కామెంట్లు ఇలా ఉన్నాయి.

‘అను మాలిక్‌ తమ పాటను కాపీ కొట్టారని ఒలంపిక్‌ గోల్డ్‌ తెలుసుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 1996 లోని దిల్జాలేలోని మేరా ముల్క్ మేరా దేశ్ పాట ట్యూన్ కాపీ చేస్తున్నప్పుడు అను మాలిక్ ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇంటర్నెట్‌కు ధన్యవాదాలు., ఇది ఇప్పుడైనా మనకు తెలిసింది. బాలీవుడ్‌ ఇజ్రాయిల్‌ జాతీయ గీతాన్ని కాపీ కొట్టింది.. ఇది నెక్స్ట్‌ లెవల్‌.. అనుమాలిక్‌ ఎంతో కచ్చితంగా ఉన్నాడు. ఇజ్రాయిల్‌ ఎప్పటికీ గోల్డ్‌ మెడల్‌ సాధించదని, ఇక తన దొంగతనం బయటపడదని’ అంటూ సంగీత దర్శకుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మాలిక్‌ స్పందించలేదు.

మరిన్ని వార్తలు