18 Pages: ఆ చాన్స్‌ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను

22 Dec, 2022 08:36 IST|Sakshi

‘‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచమే లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ ఉండదు. ‘18 పేజెస్‌’ వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ. అన్ని వర్గాల వారికీ  నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ అన్నారు. నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘18 పేజెస్‌’. డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌– సుకుమార్‌ రైటింగ్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక అనుపమా పరమేశ్వరన్‌ చెప్పిన విశేషాలు..
 
► సూర్యప్రతాప్‌గారు చెప్పిన ‘18 పేజెస్‌’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘కార్తికేయ 2’కి ముందే ‘18 పేజెస్‌’కి సైన్‌ చేశాను. ‘కార్తికేయ 2’ అడ్వెంచరస్‌ మూవీ అయితే ‘18 పేజెస్‌’ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ‘కార్తికేయ 2’ ఇక్కడ సూపర్‌ హిట్‌ కావడంతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ‘కార్తికేయ 2’ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో మా జంట (నిఖిల్, అనుపమ)కి మంచి పేరొచ్చింది. ‘18 పేజెస్‌’ చాలా మంచి సినిమా.. ‘కార్తికేయ 2’లాగే ఈ మూవీ సూపర్‌ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం.

► సుకుమార్‌గారి ‘రంగస్థలం’ చాన్స్‌ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఏ సినిమా కథ అయినా మనం ఎంచుకోం.. ఆ కథే మనల్ని ఎంచుకుంటుంది. ‘రంగస్థలం’ మిస్‌ అయినా ఇప్పుడు సుకుమార్‌గారు రాసిన పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన నందిని పాత్ర గుర్తుండిపోతుంది. సుకుమార్‌గారి కథకి సూర్యప్రతాప్‌గారు వందశాతం న్యాయం చేశారు కాబట్టే సినిమా బాగా వచ్చింది.

► ‘18 పేజెస్‌’లోని లవ్‌ స్టోరీ నా ఫేవరెట్‌. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తున్న ఈ టైమ్‌లో మొబైల్‌ లేకుండా ఒక్క రోజు కూడా చాలామంది ఉండలేరు. అలాంటిది మొబైల్, సోషల్‌ మీడియా లేకుండా ఉండే ఒక అమాయకమైన నందిని పాత్ర నా మనసుకు బాగా దగ్గరగా అనిపించింది.

► ‘నాకు అనుపమలాంటి కూతురు ఉంటే బాగుండు’ అని అల్లు అరవింద్‌గారు అనడం పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన నన్ను కూతురిలా బాగా చూసుకుంటారు. అందుకే మా కజిన్స్‌ చాలామంది ఆయన్ని మావయ్యా అని పిలుస్తుంటారు (నవ్వుతూ). బన్నీ వాసుగారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత.

► నేను ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోయాక.. నటనకు కొద్ది రోజులు గ్యాప్‌ తీసుకుని, దర్శకుల వద్ద సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని, ఆ తర్వాత డైరెక్షన్‌ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా కథ రాస్తున్నాను.. అయితే నా డైరెక్షన్‌లో నేను నటించను.

మరిన్ని వార్తలు