‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె

21 Jun, 2021 12:01 IST|Sakshi

ఫాదర్స్‌ డే స్పెషల్‌: అనురాగ్‌, అలియా కశ్యప్‌ల వీడియో వైరల్‌

1980-90ల కాలంలో తండ్రి అంటే పిల్లలకు అమితమైన భయం, గౌరవం. ఆయనతో ఏం మాట్లాడలన్నా మధ్యవర్తిగా అమ్మ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తండ్రి పిల్లలకు బెస్ట్‌ ఫ్రెండ్‌. తమకు సంబంధించిన ప్రతి విషయం తండ్రితో పంచుకుంటున్నారు. ఎలాంటి సందేహం వచ్చినా సరే నిస్సంకోచంగా అడిగేస్తున్నారు. తండ్రులు కూడా పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు తప్ప తప్పించుకోవటం లేదు. సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారు ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, ఆయన కుమార్తెల మధ్య జరిగిన ప్రశ్నోత్తరాల వీడియో ఈ మాటలను నిజం చేస్తుంది. ఇందులో అనురాగ్‌ కుమార్తె అలియా తన బాయ్‌ఫ్రెండ్‌ దగ్గర నుంచి వివాహానికి ముందే శృంగారం వరకు పలు అంశాల గురించి తండ్రికి ప్రశ్నలు సంధిస్తుంది. వాటిపై అనురాగ్‌ తన అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుతం ఈ తండ్రికూతుళ్ల సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

అలియా ఏడాదిగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రి ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్‌ షేన్ గ్రెగోయిర్‌ను తండ్రి ఇష్టపడుతున్నాడా అని అలియా ప్రశ్నిచంగా.. అందుకు అనురాగ్‌.. ‘‘గ్రెగోయిర్‌ చాలా మంచివాడు.. ఎంతో పరిణితి కల వ్యక్తి. స్నేహితుల ఎంపికలో ముఖ్యంగా మగ స్నేహితుల ఎంపికలో నీవు ఎంతో జాగ్రత్తగా ఉంటావనే విషయం నాకు అర్థం అయ్యింది’’ అని తెలిపారు. 

ఇక అమ్మాయిలు రాత్రిపూట బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడం గురించి అనురాగ్‌ ఇలా స్పందించాడు.. ‘‘పర్లేదు. అయితే చాలా మంది భారతీయ తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేరు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి.. మారుతూనే ఉంటాయి. మన పిల్లలు మనలా అణచివేతను ఇష్టపడరు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఏమాత్రం భయపడరు. కనుక మన భయాల్ని, అభిప్రాయలను పిల్లల మీద రుద్దడం ఆపేయాలి’’ అన్నారు. 

ఇక పెళ్లికి ముందే శృంగారం, గర్భం దాల్చడం వంటి అంశాలపై అనురాగ్‌ స్పందిస్తూ.. ‘‘గతంలో సెక్స్‌ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శృంగారం గురించి రహస్యంగా చాటుమాటుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్‌. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను నీకు వివరిస్తాను. మంచేంటే చెడేంటో నీకు వివరిస్తాను. ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తాను’’ అన్నారు. 

‘‘ఇక పెళ్లికి ముందే గర్బం దాల్చాను అని చెబితే.. నీవు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటాను.. నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. మద్దతుగా నిలుస్తాను. కానీ దాని మూల్యాన్ని భరించాల్సింది నీవే’’ అని చెప్పుకొచ్చారు. ఈ తండ్రికూతుళ్ల మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోని ‘‘ఇబ్బందికర ప్రశ్నలు’’ పేరుతో యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. తల్లిదండ్రులు తన పిల్లలతో ఇంత ఒపెన్‌గా ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.. తప్పులు చేయరు అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: ఒళ్లంతా చెమ‌ట‌లు, ఆ క్ష‌ణం చ‌చ్చిపోతున్నా అనుకున్నా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు