అభినవ తార.. అనుష్క

1 Sep, 2021 03:09 IST|Sakshi

చదువు, ఆటపాటల్లో చురుకుగా ఉండే ఈ అమ్మాయికి డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగే వివిధ ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. ఒకసారి డ్యాన్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొంది కానీ తొలిరౌండ్‌లో ఎలిమినేట్‌ అయ్యింది. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మంచి నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క సేన్‌. 19 ఏళ్ల అనుష్క వివిధ సీరియల్స్‌లో నటించి పాపులర్‌ అవడమేగాక, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలమంది వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులో సీరియల్స్, యాడ్స్‌లో నటిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది.  

జార్ఖండ్‌కు చెందిన అనిర్బన్, రాజ్‌రూప సేన్‌ దంపతుల ఒక్కగానొక్క సంతానం అనుష్కసేన్‌. 2002 ఆగస్టు 4న రాంచీలో పుట్టిన అనుష్క కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత, కుటుంబం ముంబైకి మకాం మార్చడంతో ముంబైలోని ‘రయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో చదివింది. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉండే అనుష్కకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ పోటీలో పాల్గొంది. కానీ కాళ్లకు సమస్య ఎదురవడంతో వెంటనే ఎలిమినేట్‌ అయ్యింది. డ్యాన్స్‌ కాంపిటీషన్‌ నుంచి వెనుతిరిగాక, అదే సమయంలో ‘యహాన్‌ మే ఘర్‌ ఘర్‌ ఖేలీ’ అనే హిందీ టీవీ సీరియల్‌లో నటించే అవకాశం అనుష్కను బిజీ చేసేసింది.

రాణి లక్ష్మిగా...
 సీరియల్స్‌లో నటిస్తూనే... రాకేష్‌ ఓమ్‌ ప్రకాష్‌ మెహ్రా కంపోజ్‌ చేసిన ‘హమ్‌కో హై ఆశా’ మ్యూజిక్‌ వీడియోలో(2012) నటించింది. మరుసటి ఏడాది బాల్‌ వీర్, దేవన్‌ కి దేవ్‌ మహదేవ్‌ సీరియల్‌లో చిన్నప్పటి పార్వతీ దేవిగా, ఫియర్‌ ఫైల్స్, క్రైమ్‌ పెట్రోల్, కామెడీ క్లాసెస్, ఇంటర్నెట్‌ వాలా లవ్‌ , అప్నా టైమ్‌ భీ ఆయేగా వంటి సీరియల్స్‌లో నటించింది. కలర్స్‌ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కీ రాణి సీరియల్‌లో అనుష్క పోషించిన రాణి లక్ష్మి పాత్ర తనకి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది.

అంతేగాక బాల్‌ వీర్‌లో మెహర్‌గా క్యారెక్టర్‌లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక్కడినుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనలో కాస్త నిలదొక్కుకున్నాక ‘షియామక్‌ దేవర్‌ డ్యాన్స్‌ అకాడమీ’లో చేరి డ్యాన్స్‌ నేర్చుకుంది. యాక్టింగ్‌ చేస్తున్నప్పటికీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌లలో ఎనభైఐదు శాతం పైగా మార్కులు సాధించింది. భవిష్యత్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేయాలని అనుష్క భావిస్తోంది.

యాడ్స్‌లో..
సీరియల్‌ ద్వారా అనుష్కకు వచ్చిన పాపులారిటీతో ఆమెకు అనేక యాడ్‌లలో నటించే అవకాశాలు వచ్చాయి. వీటిలో అమూల్‌ చీజ్, హార్లిక్స్, హరిదర్శన్‌ దూప్‌ స్టిక్స్, డీఎన్‌ఏ, అబ్సల్యూట్‌ ఇండియా, ఏరియల్‌ డిటర్జెంట్, కొరియో ఎలక్ట్రానిక్స్, ఇమేజ్‌ బజార్, నయి దునియా వంటి అనేక యాడ్‌లలో నటించింది. ఎమ్‌ఎస్‌ ధోనీతో కలిసి కమర్షియల్‌ యాడ్‌లో కూడా నటించింది. ఇవేగాక అర్బన్‌ క్లాప్, కూవ్స్, మింత్రా వంటి సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా...
అనుష్కకు కంగనా రనౌత్‌ అంటే బాగా ఇష్టం. దీంతో ఆమె నటించిన క్వీన్‌ సినిమాను అనేకసార్లు చూసింది. 2015లో ‘క్రేజీ కుక్కడ్‌ ఫ్యామిలీ’ సినిమాలో నటించి బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. లిహాఫ్‌: ద క్విల్ట్, షార్ట్‌ ఫిల్మ్‌  సమ్మదిత్తిలో నటించింది. చాలా మ్యూజిక్‌ వీడియోలలో అనుష్క నటించింది. వీటిలో ‘గల్‌ కర్కే’, ‘వియా’, ‘సూపర్‌ స్టార్‌’ వంటివి బాగా పాపులర్‌ అయ్యాయి. రామ్‌ కపూర్‌ నిర్మించిన బడే అచ్చే లగతే హై సీరియల్, డ్యాన్స్‌ టెలివిజన్‌ రియాలిటీ షో జలక్‌ ధికలాజా, కామెడీ సర్కస్‌లో పాల్గొంది.

ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్‌లు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ యూట్యూబ్‌(2017) చానల్‌లో తనకు సంబంధించిన కంటెంట్, ఫన్నీ, కామెడీ, బ్యూటీ రెమిడీ వీడియోలను పోస్టు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో పాపులర్‌ సోషల్‌ మీడియా స్టార్‌గా ఎదిగింది. ఇండియాలో టిక్‌టాక్‌ నడిచినంతకాలం టిక్‌టాక్‌ సెలబ్రిటీగా, సింగర్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క యూట్యూబ్‌ చానల్‌కు దాదాపు 24 లక్షలమంది మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా ‘ఖతరోంకే  ఖిలాడీ– 11’లో పాల్గొని ఎలిమినేట్‌ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న 19 ఏళ్ల పిన్న వయస్కురాలిగా అనుష్క సేన్‌ నిలవడం విశేషం.

తల్లిదండ్రులతో అనుష్కసేన్‌ సోషల్‌ స్టార్‌

మరిన్ని వార్తలు